2026 Tata Tiago and Tiago EV
* ధర రూ.4.69 లక్షల నుంచే
ఆకేరు న్యూస్, డెస్క్: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలో కొత్త 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్, టియాగో ఈవీ మోడళ్లను విడుదల చేసింది. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కార్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.4.69 లక్షలు, రూ.6.99 లక్షలుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లకు పోటీగా తీసుకొచ్చిన ఈ మోడళ్లు పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి. టియాగో పెట్రోల్ వేరియంట్ ధర రూ.4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.79 లక్షల నుంచి మొదలవుతుంది.
* లుక్ మార్చేసిన టాటా..
కొత్త టియాగోలో LED హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బంపర్లు, ప్రీమియం క్యాబిన్ డిజైన్‌ను అందించారు. పాత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీ, స్టైలిష్‌గా కనిపించేలా రూపొందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు.
* భద్రతలో కూడా రాజీ లేదు
ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా ఈ కారు సొంతం చేసుకుంది.
* ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం?
టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 205 నుంచి 215 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. 30kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌లో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శక్తిని పొందవచ్చు.
Battery as a Service (BAAS) పథకం కింద టియాగో ఈవీని రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించింది. బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటు ధర, ప్రీమియం ఫీచర్లు, సీఎన్జీ మరియు ఎలక్ట్రిక్ ఆప్షన్లతో కొత్త టియాగో సిరీస్ మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
