KU Campus Theft Incident
ఆకేరు న్యూస్, హన్మకొండ: చారిత్రాత్మక కాకతీయ విశ్వవిద్యాలయం (KU) క్యాంపస్‌లో దొంగలు పడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ, వరుస చోరీలు జరగడం ఇప్పుడు యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి క్యాంపస్‌లోని న్యూ పీజీ హాస్టల్‌తో పాటు వైస్ ఛాన్సలర్ (VC) కార్యాలయ భవనం పరిసరాల్లో దొంగలు హల్చల్ చేశారు.
* ఏమేం ఎత్తుకెళ్లారంటే..
క్యాంపస్‌లోని న్యూ పీజీ హాస్టల్ గదుల్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు.. అక్కడ అమర్చిన మూడు సీలింగ్ ఫ్యాన్లను విరగ్గొట్టి ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా, వీసీ భవనం వెనుక భాగంలో విద్యార్థులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన టాయిలెట్లను టార్గెట్ చేశారు. అందులోని విలువైన వాటర్ ట్యాప్‌లను (నల్లాలు) సైతం ఊడబీక్కొని పోయారు.
* పోలీసుల రంగప్రవేశం – దర్యాప్తు షురూ..
బుధవారం ఉదయం ఈ చోరీ ఉదంతాన్ని గమనించిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్‌ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
* భద్రతా వైఫల్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు…
వర్సిటీ భద్రతను పర్యవేక్షించేందుకు ఏరికోరి ఒక విశ్రాంత డీఎస్పీ (Retired DSP) స్థాయి అధికారిని సెక్యూరిటీ హెడ్‌గా నియమించినప్పటికీ ఈ తరహా దొంగతనాలు జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద క్యాంపస్‌లో, నిరంతరం నిఘా ఉండే వీసీ భవన ప్రాంగణంలోనే దొంగతనం జరిగిందంటే భద్రతా లోపం ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
* ఇంతకీ ఇంటి దొంగల పనేనా..
క్యాంపస్ లోపల ఏ భవనం ఎక్కడుంది, ఎటువైపు నుంచి వెళ్తే సెక్యూరిటీ కంటికి చిక్కకుండా తప్పించుకోవచ్చు అనే పూర్తి అవగాహన ఉన్నవారే ఈ పనికి ఒడిగట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇది ముమ్మాటికీ ‘ఇంటి దొంగల’ పనేనా, లేక బయటి గ్యాంగ్ ఏదైనా లోపలికి చొరబడిందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
