*టీ20 కప్ తో హనుమాన్ ఆలయానికి వెళ్ళిన టీమిండియా*
– టి20 కల నెరవేరిన వేళ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఎవరైనా భగవంతుని దర్శించుకుని కోరిన కోర్కె నెరవేరితే ఏం చేస్తాం టీం ఇండియా కూడా సరిగ్గా అదే చేసింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీ20 వరల్డ్ కప్ తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జై షా నిన్న రాత్రి అహ్మదాబాద్ లోని షాహిబాగ్ లో ఉన్న పురాతనమైన, శక్తివంతమైన హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. హనుమంతుడి వద్ద ట్రోఫీ ఉంచి పూజలు చేశారు. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి, భారత్ మొత్తం మూడు సార్లు 2007, 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని, అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచింది. సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. వరుసగా రెండుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న మొదటి జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా రికార్డు సృష్టించింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ తర్వాత, బ్రాడ్‌కాస్టింగ్, ప్రెస్ సమావేశాలు పూర్తి చేసుకున్న అనంతరం సూర్యకుమార్ యాదవ్, గంభీర్, జయ్ షా ఆలయానికి వెళ్లారు. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని చేతిలో పట్టుకుని హనుమాన్ దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ పూజారి ఈశ్వర్ దాస్ భారత క్రికెట్ ఆటగాళ్లు ట్రోఫీతో వచ్చి ప్రార్థనలు చేసి, ఆనందంగా ఉంది అని తెలిపారు. కాగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు 8న, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మార్చి 9న గెలిచిన తర్వాత కూడా వరల్డ్ కప్ ట్రోఫీతో కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
