* దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు
* ఆదర్శంగా నిలపడంపై దృష్టి
* అతి త్వరలో టీచర్ పోస్టుల భర్తీ
* తెరుచుకున్న పాఠశాలలు
* బడిబాట పట్టిన విద్యార్థులు
* ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లు సిద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సర్కారు బడులపై ఉన్న చిన్నచూపును మార్చి.. కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మారుతున్న ఈ ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామం. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలంటే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయంటే అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇప్పుడు తెలంగాణలో కొలువైన కొత్త ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచే దిశగా అడుగులు వేస్తోంది.
స్ఫూర్తినిచ్చిన సీఎం ప్రసంగం
పాఠశాలల ప్రారంభానికి ముందురోజున ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన ప్రసంగం చాలామంది వాట్సప్ స్టేటస్‌గా మారింది. ‘9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు కావొచ్చు.. 12న ప్రమాణస్వీకారం చేయబోయే (అప్పటికి కాలేదు) నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) కావొచ్చు, డిసెంబర్ 7, 2023న ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంతన్న కావొచ్చు.. అందరూ ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఈస్థాయికి వచ్చిన వారే’ అని పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలు, అక్కడి ఉపాధ్యాయుల గొప్పతనం చాటే ప్రయత్నం చేశారు. చేయడమే కాదు.. వాటిని గొప్పగా తీర్చదిద్దేందుకు కృషి చేస్తున్నారు కూడా.
‘ఆదర్షం’గా.. మన పాఠశాలలు ఉండాలని..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో కాంగ్రెస్ సర్కారు అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. మంచినీరు, మరుగుదొడ్లు, బల్లల కొరత లేకుండా చేస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల పర్యవేక్షణలో స్కూళ్లలో మరమ్మతు పనులు, ఇతర అవసరాల ఏర్పాట్లను పూర్తి చేశారు. స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల (SHG Groups) సభ్యులు, టీచర్లు, ఇతర అధికారులు ఉన్నారు. స్కూల్ పరిధిలో చేపట్టే ప్రతి పనినీ ఈ కమిటీల ద్వారానే నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో మరమ్మతు పనులు, మంచినీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు వంటి పనులను ఈ కమిటీలే చూసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.600 కోట్లతో మరమ్మతు పనులను పూర్తి చేశారు. అలాగే.. రాష్ట్రంలో 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) జారీ చేసింది. మరో మూడు నెలల్లో ఈ కొత్త టీచర్లను నియమించడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది.
యూనిఫామ్, పుస్తకాలు..
రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త కావడంతో మూడో వంతు మాత్రమే హాజరు శాతం నమోదు అవుతోంది. అయితే ఉపాధ్యాయులు.. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాల పంపిణీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఒక జత యూనిఫామ్ అందించారు. ఈ నెలాఖరులోగా రెండవ జత యూనిఫామ్‌ను అందించనున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలల మోజు నుంచి బయటపడేలా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం 1,11,97,976 నోట్‌బుక్‌లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రోజున 11.65 లక్షల మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు.
అకడమిక్ కేలండర్ ఇదే..
పాఠశాలల ప్రారంభం రోజునే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు ఉంటాయి. జూన్ 12 నుంచి 2025 ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఇస్తారు. డిసెంబరు 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆరు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సిలబ్‌సను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం రివిజన్ తరగతులు నిర్వహించాలి. 1 నుంచి 9వ తరగతులకు సిలబ్‌సను ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయాలి. విద్యార్థులందరికీ రోజూ ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహిస్తారు.
—————————-