* సినీ పరిశ్రమకు తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
* డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన వీడియోలు రూపొందించాలి
* సినిమాకు ముందు థియేటర్లలో ప్రదర్శించాలి
* సినీ పరిశ్రమ ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి
* డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని వెల్లడి
* పోలీసు శాఖకు కొత్త వాహనాల కేటాయింపు.. ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో షూటింగ్లకు అనుమతులు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగించేలా తారాగణంతో రెండు, మూడు నిమిషాల వ్యవధితో వీడియోలు రూపొందించాలని నిర్మాతలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. అనుమతుల కోసం వచ్చే నిర్మాతలతో ఈ విషయం చెప్పాలని పోలీసులకు సూచించారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని తెలిపారు. సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత వారిపై కూడా ఉందన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహనకు ముందుకు వస్తేనే, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు (Anti Narcotics Bureau) కొత్తగా కేటాయించిన 27 ఫోర్ వీలర్స్, 40 టూవీలర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేటాయించిన 14 ఫోర్ వీలర్స్, 30 టూవీలర్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బిగ్గెస్ట్ క్రైం.. సైబర్ క్రైం
ఇప్పుడు దేశంలో బిగ్గెస్ట్ క్రైంగా సైబర్ క్రైం (Cyber Crime) మారిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని అన్నారు. సైబర్ క్రైం నియంత్రణకు తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసుశాఖలోని అన్ని విభాగాలకూ నిధులు మంజూరు చేశామన్నారు. సమర్థవంతంగా పనిచేసే పోలీసులకు గుర్తింపు ఇస్తామన్నారు. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల వలలో బాగా చదివిన వాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లే పడుతుండడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరాల కట్టడికి, సొమ్ము రికవరీకి ఉన్నతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
సినీ ఇండస్ట్రీతో సమావేశం ఏర్పాటు చేయండి..
సినిమాల ప్రదర్శనకు ముందు థియేటర్లలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు చెందిన వీడియోలు ప్రదర్శించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. థియేటర్ల యజమానులు సహకరించాలని కోరారు. తాజా ఆదేశాలను ఇండస్ట్రీ పెద్దలకు వివరించాలని, సమావేశం ఏర్పాటు చేసి తనను పిలవాలని అధికారులకు తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైం కట్టడికి దోహదపడేలా టీవీల్లో, పత్రికల్లో అప్పుడప్పుడు ఉచితంగా ప్రకటనలు ఇచ్చి మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్త, సిటీ కమిషన్ర్ శ్రీనివాస్ రెడ్డి,
షికా గోయల్ పాల్గొన్నారు.
——————