* ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం
* రెండో విడత రుణమాఫీ ప్రారంభం
* 6, 191 కోట్లు కేటాయింపు
* లబ్ధిదారులకు అందజేసిన సీఎం
* జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
* రైతుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు : తుమ్మల
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ అగ్రనేతలు (Congress) రాహుల్ (Rahul), సోనియా గాంధీ (Sonia Gandhi) ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీ (Assembly) ఆవరణలో ఆయన రెండో విడత రుణమాఫీని ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ రైతులందరి ఇళ్లల్లో పండుగరోజని, రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారాయన. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పామని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ. లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని విమర్శించారు. వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. దేశ భద్రత, ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని, రైతుల కష్టాలు గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.
శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నాం : డిప్యూడీ సీఎం..
సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతు మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, రైతు రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
సీఎం కు కృతజ్ఞతలు : మంత్రి తుమ్మల..
రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని, ఒకే పంటకాలంలో రూ.31వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆగస్టులో రూ.2 లక్షల లోపు అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని, పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే రైతుభరోసా విధివిధానాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్ పంట వేయాలని రైతులను కోరుతున్నామని, ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ వేయాలని కోరుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. కాగా రెండోవిడత రైతురుణమాఫీకి ప్రభుత్వం 6, 191 కోట్లు కేటాయించింది. ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం కానుంది. మొదటి విడతలో రూ. 11,34,412 మంది రైతులకు రూ. 6034.96 కోట్లు అందించారు. మూడు దశల్లో రెండు లక్షల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో.. మొత్తం రూ.24,449,95 కోట్లు జమ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.
——————-