
నాగర్‌కర్నూల్ జిల్లాలో 297 యూనిట్లు వినియోగించినందుకు గానూ రూ.21 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది
* వినియోగదారుడి గుండె గుబేల్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉచిత కరెంటు దేవుడెరుగు.. 21 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు చూసి ఆ వినియోగదారుడి గుండె గుబేల్మంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డి (సర్వీస్ నెంబర్ 1110000 51) మీటర్ కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించినది. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు విద్యుత్ వినియోగించారు. అయితే.. అందుకు ఏకంగా రూ.21,47,48,569 కరెంట్ బిల్లు వచ్చినట్టు ఈ నెల 5న వినియోగదారుడికి ఇచ్చి న బిల్లులో ఉంది. దీంతో హడలిపోయిన అతడు.. అధికారులను సంప్రదించగా, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగినట్లు గుర్తించారు. వేమారెడ్డికే కాదు.. గ్రామంలో మరికొందరికి కూడా ఇలాగే రూ.కోట్లలో బిల్లులు వచ్చినట్టు తెలుస్తున్నది. ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట వాస్తవమేనని, వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామని వివరించారు.
————————-