* జ్వరాలతో వణికి పోతున్న ప్రజలు
* రాష్ట్ర వ్యాప్తంగా 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు విష జ్వరాలతో వణికి పోతున్నారు. ఇటీవల సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులు జనవరి నుంచి 25 అగస్టు వరకు జ్వరాల బారిన పడిన వారి వివరాలు వెల్లడించారు. వారు విడుదల చేసిన డేటా ప్రకారం ఫీవర్ సర్వేలో కోటి 42 లక్షల 78 వేల 723 ఇళ్లకు ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లి పరీక్షలు నిర్వహించగా, అందులో 2 లక్షల 65 వేల 324 మందికి జ్వరాలు ఉన్నట్టు గుర్తించారు.
* డెంగీ బాధితులు 5,372
తెలంగాణలో 81,932 మందికి పరీక్షలు చేయగా 5,372 మందికి డెంగీ సోకినట్లుగా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల ప్రజలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటిలో ముఖ్యంగా హైదరాబాద్‌లో 1,852, సూర్యాపేట్‌లో 471, మేడ్చల్ లోని మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్లగొండ 315, నిజమాబాద్‌లో 286, రంగారెడ్డిలో 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్ జిల్లాలో 110 మంది డెంగీతో బాధపడుతున్నట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.
* చికున్‌గున్యా బాధితులు 152
రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ 61, వనపర్తి జిల్లాలో 17, మహబూబ్ నగర్లో 19మంది చికున్‌గున్యా జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు వివరాలు తెలిపారు.
* మలేరియా బాధితులు191
తెంగాణ వ్యాప్తంగా 23,18, 283 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 191 మంది మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై 23 నుంచి 2025 ఆగస్టు 2024 వరకు వైద్య శాఖ అధికారులు 1,42,78,723 ఇళ్లకు చేరుకొని 4,40,06,799 మంది వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,65,324 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
డెంగీ, చికున్‌గున్యా మరియు మలేరియా నివారణకు రాష్ట్రంలో 42 టీ-హబ్ ల్యాబ్‌లు, 53 బ్లడ్ బ్యాంకులు తగిన రక్త యూనిట్లతో పనిచేస్తున్నాయి. అలాగే, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో 108 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. మలేరియా నివారణకు మందులు, అందుకు కావలసిన వైద్య సదుపాయాలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
———————————-