* కృష్ణాజలాలు, ఆల్మట్టి ప్రస్తావన
* ద్రోహం చేసిన వారే సుద్దులు చెబుతున్నారని విమర్శలు
* ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజలాల వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని అన్నారు. ఈరోజు మీడియాకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క ఉందన్నారు. 299 టీఎంసీ కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే. చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్. ఒకవైపు చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ ఉందని ఆలమట్టి ఎత్తుపై మౌనం వహిస్తున్నారు.
రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువ
రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి (Uthamkumar reddy) మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం. ఉత్తం కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు.. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నడు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
అసలు ఎవరిది కరెక్టు?
కాంగ్రెస్ నేతల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు? కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నరు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు అని హరీశ్‌రావు నిలదీశారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నడు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు. తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టు లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఛీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతే. 299:512 హక్కుల విషయంలో మేం సంతకం పెట్టినం అని నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేస్తవా ఉత్తం? అని హరీశ్‌రావు (Harisrao) సవాల్ విసిరారు.
……………………………………..
