
* బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు
* హై కోర్టు స్టేను తొలగించేందుకు సుప్రీం నిరాకరణ
* మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సూచన
* పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన
* తుది నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేసిన సుప్రీం కోర్టు
ఆకేరు న్యూస్ డెస్క్ : సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్ అంశంపై వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని.. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని.. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. అయితే ఈ రిజర్వేషన్ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకొని రావాలని చెప్పిన సుప్రీంకోర్టు .. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు ఏసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చంటూ పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది.
………………………………………