* నరరూప రాక్షసుడు బాబుదొరను పరుగులు పెట్టించాడు
* 107 సంవత్సరాల వయస్సు
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామ శివారులోని జాటోత్ తండాకి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ దర్గ్యా నాయక్(107)సోమవారం సాయంత్రం మరణించారు. జాటోత్ దర్గ్యా నాయక్ మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, గ్రామస్థులు, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం వ్యక్తం చేశారు.
జననం..
జాటోత్ దర్గ్యా నాయక్ 1918 మార్చి17 తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని ధరమాపూర్ పడమటి తాండలో జాటోత్ హము నాయక్, మంగిబాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించాడు.ఇతను తుపాకీ కాల్చడం లో దిట్ట.గెరిల్లా దళ నాయకుడు. ఇతని అన్న కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్ ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ దళ నాయకుడు.
కుటుంబ నేపధ్యం..
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధర్మాపూర్ తాండాలో జాటోత్ హమునాయక్, మంగిబాయి దంపతులకు గిరిజన బంజారాలంబాడీ ఐదుగురు సంతానంలో దర్గ్యా నాయక్ అయిదో సంతానం. జోద్యానాయిక్, సోమ్లా నాయక్,సక్రు నాయక్, జాటోత్ ఠాను నాయక్, నలుగురు. కీషన్ నాయక్ దర్గ్యా నాయక్ కంటే చిన్నవారు. దర్గ్యా నాయక్ వదినమ్మ పేరు జాటోత్ ఫూలిబాయి విసునూరు దొరలపై కడవెండి కి చెందిన దొరసాని జానకమ్మ పై వీరత్వాన్ని ప్రదర్శించిన వీరనారి జోద్యా నాయక్ సతీమణి.వీరి బంధుమిత్రులు జాటోత్ రెడ్యా,అజ్మేర బలరామ్,అజ్మేర చంద్రునాయిక్,రాము నాయక్,బోడా గోల్యా నాయక్,థావ్రు నాయక్,ధారావత్ కీషన్ నాయక్, మొదలగు వారు ఆపత్కాల పరిస్థితిలో వీరి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటు సహచరులుగా ఉండి సహాకరించే వారు.
దొరలపై విజయం..
నిజాం పాలన కాలంలో దొరలు, దేశ్ముఖ్లు, జాగీరుదారులు,జమిందారులు,పెట్టేళ్ళు పేదల భూములను అన్యాయంగా దురాక్రమణ చేసేవాళ్ళు,రైతులను తమ భూముల నుండి తరిమిమేసే వాళ్ళు,పేదలతో వెట్టి చాకిరి చేయించేవాళ్ళు,ఆడవాళ్ళ మానాలను దోచే వాళ్ళు రకరకాల పన్నులతో ప్రజలను జలగల్లా పీడిరచే వాళ్ళు, ఎవరైనా ప్రశ్నించినా, పన్నులు కట్ట లేకపోయినా అత్యంత కరమైన నిర్భందాలను ప్రయోగించే వాళ్ళు, జాటోత్ దర్గ్యా నాయక్ తండ్రి హము నాయకత్వంలో 80 ఎకరాల అటవి భూమి సాగులోకి తీసుకొచ్చారు.ఆ భూముల్లో పంటలు బాగా పండటంలో ధరమాపూర్ వెలమ దొర పూసుకూరి రాఘవరావు,ఆ భూమి తన పంట భూమి అని వేధించడం మొదలు పెట్టాడు. భూమిని తన స్వాధీనం చేసుకోవచ్చని దాడి ప్రారంభించాడు.తన తండ్రి హము నాయకత్వంలో లంబాడీ లు ఏకమై,గుండాలను తరిమికొట్టారు. 1944లో రాఘవరావు విసునురు దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డి సహాయంతో లంబాడీలు పెద్ద సంఖ్యలో గుండాలను తరిమికొట్టి విజయం సాధించారు.
త్యాగాల కుటుంబం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరమాపూర్ పడమటి తండా లోని జాటోత్ హము కుటుంబం త్యాగాలకు, ధైర్య సాహసాలకు నిదర్శనం కడివెండి గ్రామంలో నిజాం మిలటరీ కాల్పులు జరిపి దొడ్డి కొమరయ్య ను బలిగొన్నప్పుడు గ్రామ ప్రజలకు ఈ కుటుంబం మనోధైర్యం చెప్పి ,వాళ్ళందరిని కూడదీసి కదిలించింది ఈ జాటోత్ ఠాను నాయక్, జాటోత్ దర్గ్యా నారక్ కుటుంబమే.! విసునూరు దేశ్ ముఖ్ గుండాలు ఆ గ్రామం పై దాడి చేసినప్పుడు ఈ కుటుంబం ఇచ్చిన సాహసం, ధైర్యం,ప్రోత్సాహం అంతులేనిది. ఈ ఉత్సాహం వల్లనే ఆ గ్రామ ప్రజలు ఆ గుండాలకు తగిన శాస్తి చేశారు.ఈ కుటుంబ సభ్యులు ఆడ మగ అను భేదం లేకుండా ఐక్యంగా అందరు పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు.
దర్గ్యానాయక్ పుస్తకం..
తెలంగాణ పోరాట యోధుడు, గెరిల్లా దళ నాయకుడు కామ్రేడ్ జాటోత్ దర్గ్యా నాయక్ పోరాట పటిమను, జీవిత చరిత్రకు సంబంధించిన పుష్తకాన్ని రచయిత జీలుకరా వెంకన్న రచించారు. బంజారా భీం దర్గ్యా నాయక్ పేరుతో తీసుకొచ్చారు.
……………………………………………….