* కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* కుల గణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై సంబురాలు
* రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం
ఆకేరున్యూస్, వరంగల్: ఫిబ్రవరి 4వ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని చరిత్రాత్మక రోజు అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు కీలక సామాజిక ప్రక్రియలు నిన్నటి రోజు పూర్తవడంతో దేశంలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆసెంబ్లీ వేదికగా బీసీ కుల గణనకు చట్టబద్దత కల్పిస్తూ, ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయండంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సంబురాలు చేసుకున్నారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మీద ఇతర పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొన్ని పార్టీల నాయకులు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆమోదించకపోగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా స్వాగతించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఫలితాలను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకున్నారని మండిపడ్డారు. బీసీల సంఖ్య తగ్గిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కొందరు మూర్ఖులు తమ అభద్రతభావాన్ని చెప్పలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు. గతంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చిందని ఉపాధిహామీ పథకాన్ని అమలు చేసిందని, సమాచార హక్కు చట్టం తెచ్చిందని, రేషన్ కార్డులను అందించనుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ సైనికులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ మెంబెర్ ఈవీ శ్రీనివాస్ రావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఆర్టీఏ నెంబర్ పల్లకొండ సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు.
………………………………………