* పవన్ కొబ్బరి తోట మాటలపై తెలంగాణ నేతల మాటల తూటాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో తెలియదు…పేరకేమో పవర్ స్టార్..కానీ తాను మాట్లాడే మాటలేమో పరువు పోగొట్టుకునే మాటలు..తన అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ నేతలపై ఇష్టం ఉన్నట్లు నోరుపారేసుకున్నారు. కాంగ్రెస్ నేతల బట్టలూడదీయాలంటూ వీరంగం చేశారు. ఆ తరువాత అభినవ కమ్యూనిస్టు అవతారమెత్తారు. చేగువేరానే తనకు ఆదర్శం అన్నారు..ఇప్పుడే మో స్టేజీలెక్కి సనాతన ధర్మం కాపాడాలంటూ గొంతెత్తి మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలపై ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. ఆయన మాట్లాడిన మాటలకు ఇంత వ్యతిరేకత వస్తుందని పవన్ ఊహించలేక పోయారా లేక తన మనసులో ఉన్నతి మాట్లాడారా అనేది తెలియదు.. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్లదిష్టి తగిలి ఎండిపోయాయంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై మొత్తం తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది.. తెలంగాణ ప్రజలు కొబ్బరి కాయలు కొనకపోతే ఆంధ్రాలో కొబ్బరి తోటలు ఉండేవా అంటూ ప్రశ్నిస్తోంది.. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీల నేతలు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
70 ఏళ్లు అయినా సీఎం కాలేవు :జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పవన్ వ్యాఖ్యలపై జడజ్చర్ల ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. 70 ఏళ్లు అయినా పవన్ సీఎం కాలేరు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మీద అంత ధ్వేషం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లిపో అంటూ పవన్ కు సూచించారు. దమ్మంటే టీడీపీ అండ లేకుండా గెలచి చూపించాలని సవాల్ విసిరారు. ఓజీ సినిమా ప్లాప్ అయినా 800 ఖర్చుపెట్టి సినిమా చేశానని అనురిధ్ అన్నారు. తెలంగాణ ఆంధ్ర వాళ్లు వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్న విషయం పవన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు.
పవన్ క్షమాపణ చెప్పాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాప ణ చెప్పాలని లేకుంటే తెలంగాణలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడవు అంటూ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలను అవమాన పరిస్తే ఊరుకోం అని అన్నారు.
అహంకారంతో మాట్లాడుతున్నారు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తెలంగాణ కు వస్తే పరుగెత్తిస్తాం అంటూ హెచ్చరించారు.
బాధ్యతగా మాట్లాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతతో మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పవన్ ఇప్పుడు నటుడు కాదని డిప్యూటీ సీఎం అని పొన్నం గుర్తు చేశారు. పవన్ తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. జనసేన మిత్ర పక్షమైన బీజేపీ నాయకులు పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దయతో డిప్యూటీ సీఎం అయ్యావు : బీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్
చంద్రబాబు దయతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని హితవు పలికారు.
పవన్ సినిమాలు వాటంతల అవే ఆగిపోతాయి : పేర్ని నాని
పవన్ సినిమాలను ఆడనివ్వమని తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని తెలంగాణ లో పవన్ సినిమాలు వాలంతట అవే ఆగిపోతాయని ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. నిర్మాతగా పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు.
పవన్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. ఎక్కువ సమయం తెలంగాణలో ఉండే పవన్ కల్యాణ్ తెలంగాణ ను ప్రేమించాలని జగదీష్ రెడ్డి కోరారు. ఉద్యమ సమయంలోనే ఆంధ్రా వారిని కడుపులో పెట్ట చేసుకున్న విషయం పవన్ కు తెలియదా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు
పవన్ కల్యాణ్ ను బర్తరఫ్ చేయాలి : సీపీఐ నారాయణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ అగ్ర నేత నారాయణ డిమాండ్ చేశారు. ఇలాంటి నేతలు రాష్ట్రాన్ని ఎలా నడుతుతారని ప్రశ్నించారు. తెలంగాణలో దందాలు చేస్తూ తెలంగాణ ప్రజలను విమర్శిండం ఏంటని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రజలది పెద్ద మనసు : కల్వకుంట్ల కవిత
తెలంగాణ ప్రజలది సంకుచిత మనస్తత్వం కాదని తెలంగాణ ప్రజలు విశాల హృదయం కల వారని
జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణ ప్రజలు పక్కనున్నోడు బాగుండాలని కోరుకునే రకం అని కవిత అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరానని కవిత గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని కవిత సూచించారు.
