MeeSeva Certificate Updates Minister Sridhar Babu
* ఇకపై లామినేషన్ అవసరమే లేదు
* 15 కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో స్పెషల్ పేపర్
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రజాప్రయోజనాల దృష్ట్యా పౌరులకు అందించే ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలను (సర్టిఫికెట్లు) ఇకపై నకిలీలకు తావులేకుండా, సుదీర్ఘకాలం మన్నికగా ఉండేలా ప్రత్యేక నాణ్యతతో రూపొందించిన కొత్త ‘సెక్యూరిటీ పేపర్’ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
హైదరాబాదులోని ప్రజాభవన్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కొత్త సెక్యూరిటీ పేపర్ను లాంఛనంగా ప్రారంభించారు.
* లామినేషన్ అవసరం లేదు
సాధారణంగా ప్రజలు తమ ముఖ్యమైన ఆదాయ, కుల, జనన, మరణ వంటి ధ్రువపత్రాలు పాడవకుండా ఉండటానికి భారీగా ఖర్చు చేసి లామినేషన్ చేయించుకుంటుంటారు. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పేపర్ ప్రత్యేక సాంకేతికతతో రూపొందించబడింది.
వాటర్ అండ్ టియర్ రెసిస్టెంట్ వల్ల ఈ కొత్త పేపర్ నీటిలో తడిసినా చెరిగిపోదు, మడతలు పడినా లేదా నిత్యం వాడినా అంత సులభంగా చినిగిపోదు. నకిలీ సర్టిఫికెట్ల సృష్టి, అక్రమ కాపీలను అరికట్టేందుకు ఇందులో 15 రకాల అత్యాధునిక రహస్య భద్రతా ప్రమాణాలను (Anti-Forgery Features) చేర్చారు. పేపర్ మన్నిక చాలా ఎక్కువగా ఉండటం వల్ల పౌరులు వీటికి ప్రత్యేకంగా లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
* 2011 నాటి పాత విధానానికి స్వస్తి
మీసేవ కేంద్రాల్లో 2011 నుండి ఉపయోగిస్తున్న పాత తరం సెక్యూరిటీ పేపర్ స్థానంలో ఈ నూతన సాంకేతికతతో కూడిన పేపర్ను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకోవాల్సి వస్తుందని, ప్రజల సౌకర్యార్థం మరియు భద్రత దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌర సేవల్లో పారదర్శకత, నాణ్యత పెంచడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, విజయరామణారావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) కమిషనర్ టి.రవికిరణ్ తో పాటు ఐటీ శాఖ ప్రతినిధులు, ముద్రణా సంస్థల అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

