* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) అన్నారు. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి (TELANGANA THALLI) రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ( PRAJA PRABUTHVAM) సిద్ధమైందని ఈ పవిత్ర శాసనసభ సాక్షిగా అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నానన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (AMBEDKER SACHIVAALAYAM) ఆవరణలో ప్రతిష్టాపన చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM REVANTHREDDY) శాసనసభలో ప్రకటన చేశారు. ‘‘చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని.. పేర్కొన్నారు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కల్సవల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాఖ్యలు అన్నారు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే అని.. అస్తిత్వానికి మూలం సంస్కృతి.
ఆ సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి అన్నారు. తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహూళ్యంలో ఉన్నాయని.. వాటిలో దేనికి ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదన్నారు. అధికారికంగా మనం గౌరవించుకోలేదని.. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల.. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయాలు, సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండు పూసల ఆహారంతో, చెవులకు బుట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడిరదని పేర్కొన్నారు. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సంప్రదాయ పంటలైన వరి జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు.
తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించామని.. తెలంగాణ చిరునామానే ఉద్యమాలు పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు, దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగిందని వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయని.. తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది. గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో, నీలి వర్ణం గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడపంగా… అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలలో పసిడి సిరులు పండంగా.. అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుందని సీఎం వివరించారు.
……………………………………….