* 3,752 గ్రామ పంచాయితీలు
* 53,06,395 మంది ఓటర్లు
* 36,452 పోలింగ్ కేంద్రాలు
* పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల సందర్శన
* పోలింగ్ మద్యాహ్నం గం. 1 .00 వరకు 80.78 శాతం నమోదు
ఆకేరు న్యూస్, వరంగల్ : చివరి దశ గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినాయి. ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు. రెండు దశల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ ఎస్ పార్టీ తమ ప్రాధాన్యతను కోల్పోకుండా సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. ఈ దశ లో 3,752 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 36,452 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
53,06,395 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు చేరుకున్నారు. చాలా కాలం తర్వాత ఓట్ల కోసమైనా గ్రామానికి రావలసి వచ్చిందని ఓటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ మద్యాహ్నం ఒంటిగంటవరకే కావడంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. హరిత పోలింగ్ స్టేషన్లను అందంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలన సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ 80.78 శాతం నమోదైంది .81.11 శాతం హనుమకొండ జిల్లాలో పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో 77.58 శాతం . ములుగు జిల్లాలో 82.56 శాతం పోలింగ్ నమోదైంది. 83.30 శాతం నమోదైంది. కాగా ఈ పోలింగ్ శాతం మద్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైంది.. పోలింగ్ కేంద్రాల్లో ఒంటి గంటలోపు ఉన్న వారితో కలిపితే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి.

*జిల్లా కలెక్టర్ లు స్నేహ శబరీష్ , సత్య శారద పోలింగ్ కేంద్రాల సందర్శన

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారదలు పోలింగ్ కేంద్రాలును సందర్శంచారు. హనుమకొండ జిల్లా శాయంపేట, దామెర మండల కేంద్రాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం పరిశీలించారు. శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లను పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం గురించి ఎన్నికల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెండువేలకుపైగా ఓటర్లు ఉన్న పెద్ద గ్రామపంచాయతీలు ఉన్నచోట్ల నాలుగు టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ కేంద్రాలలో ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కు సంబందించిన అంశాలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు డి ఆర్ డి ఓ మేన శ్రీను, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, మండల ప్రత్యేకాధికారులు జయంతి, బాలరాజు, ఎంపీడీవోలు ఫణి చంద్ర, కల్పన, తహసిల్దార్లు ప్రవీణ్ కుమార్, జ్యోతి వరలక్ష్మి దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే విదంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన
మూడవ విడత పోలింగ్
* హరిత పోలింగ్ కేంద్రాల పట్ల ఆసక్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం నర్సంపేట మండలం: లక్నేపల్లి ఇటుకాలపల్లి, పోలింగ్ కేంద్రాలు, ఖానాపూర్ మండలం ఖనాపూర్, రాగంపేట పోలింగ్ కేంద్రాలు, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, తిమ్మరాయనిపహాడ్ పోలింగ్ కేంద్రాలు, నెక్కొండ మండలం రెడ్లవాడ, ఆలంఖానిపేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాలతో పాటు పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయం లేని వాతావరణం కల్పించడం సిబ్బందిపై నున్న ప్రధాన బాధ్యత అని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ముఖ్యమైన అంశమని జిల్లా కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల సూచనల మేరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి రెండు చొప్పున హరిత (గ్రీన్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి, రెండవ విడతలలో హరిత పోలింగ్ కేంద్రాలలో మిగతా పోలింగ్ కేంద్రాల కంటే సుమారు 3 శాతం పోలింగ్ పెరిగిందని, గ్రీన్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని, తద్వారా పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓలు ఉమారాణి, సుమా, నోడల్ అధికారులు, ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………………
