Huzurabad dumping yard protest
*ఐలోని పట్నాల్లో పాల్గొనాలనీ ప్రజలకు పిలుపు
*డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం
*ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
డంపింగ్ యార్డ్ పై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలంటే వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రజలే డంపింగ్ యార్డ్ కోరుకుంటున్నారన్న సుడా చైర్మన్ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గ్రామ సభ నిర్వహిస్తే ప్రజలే తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని, అప్పుడు పాలకులకు అసలు విషయం అర్థమవుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనకు తాము సంతకం చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, లేనిపక్షంలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆందోళనకారులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. డంపింగ్ యార్డ్ కోసం సుమారు 500 ఎకరాల భూమిని సేకరించినట్లు సమాచారం ఉందని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తొమ్మిది మండలాల ప్రజలను ఏకం చేసి, అఖిలపక్షం ఆధ్వర్యంలో లక్ష మందితో భారీ ధర్నా చేపడతామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగా ఈనెల 19న డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత ప్రాంతంలోని ఐలోని మల్లన్న ఆలయంలో నిర్వహించే పట్నాల కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
