* నేడు నాలుగోదశ ఎన్నికలు
* 10 రాష్ట్రాల్లో కొనసాగతున్న పోలింగ్
* సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేడు నాలుగోదశ పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి సమస్యలు లేకుండ ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు. నాలుగోదశ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ- 17 , ఆంధ్రప్రదేశ్-25 ,ఉత్తర ప్రదేశ్ -13, మహారాష్ట్ర -11, మద్య ప్రదేశ్ -8, పశ్చమ బెంగాల్-8,బిహార్ -5, జార్ఖండ్ -4, ఒడిస్సా-4, జమ్ము కశ్మీర్-1 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కాగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
తెలంగాణ లో ఉత్సాహం
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్ల బడింది. రాష్ట్రంలోని పలు చోట్ల ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. భగభగ మండే ఎండల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సాహంగా ప్రజలు పోలింగ్లో పాల్గొంటున్నారు. రాజకీయ , సినీ ప్రముఖులు ఉదయమే ఓటేశారు. గత ఎన్నికలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు అర్థమవుతోంది. పోలింగ్ ముగిసేవరకు ఇదే ఉత్సాహం కొనసాగుతుందా లేదా అని చూడాల్సి ఉంది. కాగా తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32, 318 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,65,28,366 , మహిళలు – 1,67చ01,192 , థర్డ్ జెండర్- 2,760 మంది ఉన్నారు. 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటేయడానికి అవకాశం ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అవకాశం ఉంటుంది.
—————-