* కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం
* సాగు లెక్కల కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి
ఆకేరున్యూస్, హైదరాబాద్: వానాకాలం సాగు సమయంలో తెలంగాణలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. బస్తా యూరియా కోసం గంటల కొద్ది కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్నారు. యూరియా కొరతపై ఇటు విపక్షాల నుంచే కాక ప్రజలు కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇక విపక్షాలు అయితే ప్రభుత్వ అసమర్థత వల్లే కేంద్రం రాష్ట్రానికి సరిపడా యూరియాను సరఫరా చేయలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి యూరియా కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా సాగు విస్తీర్ణం ప్రకరమే యూరియా పంపిణీ చేయనున్నారు. అంటే రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాల ఆధారంగానే యూరియా పంపిణీ జరగబోతుంది. దీనికోసం రైతుల పట్టాదారు పాస్బుక్కుల నుంచి వివరాలు సేకరించి.. ఎంత యూరియా అవసరమో లెక్కలు తేల్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు తాము సాగు చేసే పొలం విస్తీర్ణం కంటే ఎక్కువ యూరియా తీసుకోకుండా ప్రత్యేక యాప్‌ని అభివృద్ధి చేస్తున్నారు. గత నెల నుంచి ఆధార్ లింకుతో ఈ-పాస్ యంత్రాల ద్వారా యూరియా, ఇతర మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. రైతుకు ఉన్న భూమికి ఎంత యూరియా అవసరమో అంతే తీసుకునేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరమని కేంద్రానికి లేఖ రాసింది. ఈ నెలాఖరు వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరింది. వ్యవసాయ శాఖ అధికారులు పంటలు వేసిన రైతులు ఏమేరకు యూరియా వాడకం చేస్తారో పట్టాపాసు బుక్ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అధికారులు వివరాల ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు.
…………………………………..

