Dancers Association Film Federation Dispute
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డాన్సర్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో.. చివరకు డాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించినట్లు ప్రకటించింది. ఫెడరేషన్ పరిధిలోని మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తాయని తెలిపింది.
* అసలు వివాదం..
డాన్సర్స్ అసోసియేషన్‌లో కొందరు సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే మొత్తం కార్యవర్గానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఫిల్మ్ ఫెడరేషన్ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల నిర్వహణ, నిబంధనల విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని.. చివరకు అసోసియేషన్ కార్యాలయంలో గొడవ వరకు వెళ్లినట్లు సమాచారం.
వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో పాటు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
* ఫెడరేషన్ జోక్యంపై సుమలత అభ్యంతరం
డాన్సర్స్ అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవడంపై సుమలత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ ఫెడరేషన్లో భాగమేనని, ఫెడరేషన్‌కు అనుబంధంగానే పనిచేయాల్సి ఉంటుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
అసోసియేషన్ వ్యవహారాల్లో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, గతంలో వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురైన సభ్యులను కూడా తిరిగి కలుపుకోవాలని పెద్దలు సూచించినప్పటికీ.. ఆ సూచనలు అమలు కాలేదని ఫెడరేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
* ఫెడరేషన్ ఆగ్రహం..
అందరూ కలిసి పనిచేయాలని కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని ఫెడరేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఒక అవకాశం ఇచ్చినప్పటికీ ఫెడరేషన్ సూచనలను పట్టించుకోకుండా సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి.
అయితే తప్పు చేసిన వారితో కలిసి పనిచేయలేమని, అవసరమైతే తాము రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని సుమలత పేర్కొంటున్నట్లు సమాచారం. అసోసియేషన్ ఎన్నికల్లో ఫెడరేషన్ జోక్యాన్ని కూడా ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తాజా నిర్ణయం.. డాన్సర్స్ యూనియన్‌కు కటీఫ్…
వివాదం మరింత ముదరడంతో డాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.
ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సుమలతపై ఫెడరేషన్ ఆరోపించింది. పెద్దలు ఇచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టారని పేర్కొంది.
డాన్సర్స్ అసోసియేషన్‌లో తలెత్తే వివాదాలు, అంతర్గత సమస్యలు లేదా న్యాయపరమైన చిక్కులకు ఇకపై ఫెడరేషన్ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా సినీ కార్మికుల వేతన ఒప్పందాలు, ఫిల్మ్ చాంబర్‌తో జరిగే చర్చల్లో డాన్సర్లకు ఫెడరేషన్ తరఫున ఎలాంటి ప్రతినిధ్యం లేదా మద్దతు ఉండదని ప్రకటించింది.
* 23 క్రాఫ్ట్స్ కూడా అదే బాటలో..
ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయానికి మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా మద్దతు ఇస్తాయని ఫెడరేషన్ ప్రకటించడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ప్రముఖ కొరియోగ్రాఫర్ల మధ్య కూడా ఈ వివాదంపై విభేదాలు బయటపడటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఎక్కడికి దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డాన్సర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదానికి ఇక ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
