* అడ్డుకట్ట కష్టమే అంటున్న పోలీసులు!!
* ఒకటి ఆపితే.. ఇంకొకటి
* దేశ, విదేశీ ఐపీ అడ్రస్‌లతో వెబ్సైట్లు
* ఐ బొమ్మ రవి డొంక లాగితే..
* తెరపైకి మరిన్ని పైరసీ ముఠాలు
* నిర్మాణ సంస్థలు జాగ్రత్త పడాలని పోలీసుల సూచనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో పైరసీ సినిమాలకు అడ్డుకట్ట పడేనా అంటే.. కష్టమే అని పోలీసుల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. సైబర్ లింకులతో పుట్టుకొస్తున్న ఈ వెబ్సైట్లను పూర్తిగా నివారించడం అసాధ్యమని కొందరు పోలీసులే ఒప్పుకుంటున్నారు. ఒక దాన్ని ఆపితే, ఇంకొకటి పుట్టుకొస్తాయని, వస్తున్నాయని చెబుతున్నారు. ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను నిలిపివేయించిన వెంటనే ఐబొమ్మ వన్ పేరుతో ఇంకొకటి తెరపైకి రావడమే ఇందుకు నిదర్శనం. సినిమాలను పైరసీ చేయడమే కాకుండా.. ‘నన్ను ఎవరూ ఏం చేయలేరు’ అని సవాల్ విసిరిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబడుతున్నారు. అయితే.. ‘నేను ప్రజల సొమ్ము రూపాయి తినలేదు. ఎవరికీ నష్టం కలిగించలేదు’ అంటూ పోలీసు విచారణలో రవి నిర్భయంగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
విడుదలైన రోజే..
థియేటర్లలో విడుదలైన రోజునే సినిమాలను పైరసీ చేసి, వివిధ వెబ్సైట్ల ద్వారా వాటిని ప్రజలు వీక్షించేలా చేసి సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కట్టించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలోనే గత నెలలో బిహార్‌కు చెందిన అశ్వనికుమార్ ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. అశ్వనికుమార్ ముఠాలో బిహార్‌కు చెందిన అర్సలాన్ అహ్మద్, తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్సంట్రాజ్, సుధాకరణ్, ఏపీకి అమలాపురానికి చెందిన జాన్ కిరణ్‌కుమార్ ఉన్నారు. ఈ ముఠా సభ్యులు 2020 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్‌తో పాటు.. దేశవాప్తంగా వివిధ భాషలకు చెందిన సుమారు 500 చిత్రాలను పైరసీ చేశారు.
రూ. 22,400 కోట్ల నష్టం
అశ్వనికుమార్ ముఠా పైరసీ వల్ల దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు కలిపి మొత్త రూ. 22,400 కోట్లు నష్టం వాటిల్లినట్లు పోలీసులు ఓ అంచనాగా గుర్తించారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీకే రూ.3,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు లెక్కలు తేల్చారు. నిందితులు పైరసీ చేసిన సినిమాల్లో హిట్, ది థర్డ్‌కేస్, సింగిల్, కుబేరా, హరి హర వీరమల్లు ఉన్నాయన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 100 సినిమాల వరకు రికార్డు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అశ్వనికుమార్ హ్యాకింగ్ నిపుణుడుగా పోలీసులు గుర్తించారు. 1ఎక్స్‌బెట్, 4రాబెట్, రాజ్బెట్, పరిమాటెక్ వంటి బెట్టింగ్, గేమింగ్, టెలీగ్రామ్ చానళ్ల ద్వారా పైరసీ కాపీలను విడుదల చేసేవాడు.
50 లక్షల మంది డేటా
తాజాగా ఐ బొమ్మ పేరుతో సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని కొత్త ముఠాలు ఉన్నాయని విచారణలో పోలీసులు గుర్తిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇమ్మడి రవి.. ఐ బొమ్మ పేరుతో సుమారు 2వేల సినిమాలు తన వెబ్సైట్లో చేర్చినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ఇతర దేశాల్లో ఉంటున్న రవి.. సినిమా పైరసీకి పాల్పడుతూ రూ.కోట్లు గడించాడు. సుమారు 50లక్షల మంది డేటాను సేకరించిన ఆయన ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. కేవలం అశ్వనికుమార్, ఇమ్మడి రవి ముఠాలే కాకుండా మరికొన్ని ఉన్నాయన్న సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు.
విదేశాల్లో ఐపీ అడ్రస్‌లు
పైరసీ వెబ్సైట్లను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు అశ్వనికుమార్ ముఠా అయినా, ఇమ్మడి రవి అయిన తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీ అడ్రస్ లొకేషన్లను నెదర్లాండ్స్, పారిస్ వంటి దేశాలకు మార్చేవారు. అందుకుగాను సర్వర్ హోస్టింగ్ కంపెనీ నుంచి నెదర్లాండ్స్, పారిస్ లొకేషన్లు చెందిన రెండు ప్రత్యేక వర్చువల్ మిషన్ సర్వర్లను నిందితులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ద్వారా టెలీగ్రామ్ అప్లికేషన్, జీ మెయిల్ ఖాతాలు, పైరసీ సినిమాలు విడుదల చేసే వెబ్సైట్ల నిర్వహణకు విఎం వేర్ అనే టెక్నాలజీని వినియోగించినట్లు తెలిసింది. ఇమ్మడి రవి అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఐపీ అడ్రస్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిర్మాణ సంస్థలూ జాగ్రత్తలు తీసుకోవాలి
సినిమా ఇండస్ట్రీకి క్యామ్ రికార్డింగ్ అతిపెద్ద ముప్పు అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. హోస్టింగ్ కంపెనీలు, ఐఎస్పీలు, డిజిటల్ పైరసీకి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నెలల తరబడి 24 విభాగాలకు చెందిన వందల మంది కార్మికులు శ్రమకోర్చి రూ.కోట్లు చేసి తీసిన సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా నిర్మాణ సంస్థలు తీసుకోవాలని సీపీ సూచించారు. పైరసీ మూలాన్ని ట్రాక్ చేయడానికి పటిష్టమైన పోరెన్సిక్, వాటర్ మార్కింగ్‌లను వినియోగించాలన్నారు. థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో సినిమాను రికార్డు చేయకుండా నిరోధించడానికి సినిమా హాళ్లలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.

