* అందుకే స్థానికుల తీవ్ర నిరసన
* బీజాపూర్ హైవేపై ఎన్నో ప్రమాదాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెను విషాదాన్ని నింపింది. 19 మందిని పొట్టనబెట్టుకుంది. ఇంకా ఎంతో మందిని క్షతగాత్రులుగా చేసింది. టిప్పర్ డ్రైవర్ అతివేగం ప్రమాదానికి ప్రధాన కారణం కాగా, రోడ్డుపై ఉన్న పెద్ద గుంత మరో కారణమని స్థానికులు భావిస్తున్నారు. హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దగ్గర రోడ్డుపై ఉన్న పెద్ద గుంతే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని పేర్కొంటున్నారు. మూలమలుపులో ఆర్టీసీ బస్సు- టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనను పరిశీలిస్తే రోడ్డుపై ఉన్న గుంతనే కారణం కావొచ్చని చెబుతున్నారు. గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. అందుకే అక్కడ స్థానికుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అలాంటివి ఎన్నో మలుపులు..
హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై అడుగుకో గుంత.. గజానికో గొయ్యి ఏర్పడటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డు మధ్యలో, రోడ్డు పక్కన ఏర్పడిన ఈ గుంతలు మృత్యువును తలపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 66 రోడ్డు మలుపులున్నాయి. అందులో ప్రమాదకరమైనవిగా 19. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ దాటిన తర్వాత రెండు మలుపులు, రాణె ఇంజన్వాల్స్, ఎనికెపల్లి చౌరస్తా, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ పాత చౌరస్తా, చిలుకూరు మృగవని సమీపంలో రెండు మలుపులున్నాయి. అజీజ్‌నగర్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పక్కనే మరో రోడ్డు మలుపు ప్రమాదాన్ని తలపిస్తుంది. భాస్కర మెడికల్ కళాశాల, అమ్డాపూర్ గేట్, మొయినాబాద్ పీఎస్-మల్లన్నగుడి, ఎంపీడీవో కార్యాలయం-ఫ్లోర్‌మిల్ వద్ద రోడ్డు మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మీర్జాగూడ-ఖానాపూర్ వద్ద మూడు మలుపులు, ఖానాపూర్-ఆలూరు మధ్యన రెండు చోట్ల రోడ్డు మలుపులు డేంజర్‌గా మారాయి. అలాగే చిట్టంపల్లి, అంతారం- కండ్లపల్లి మధ్యన మూడు, అంతారం కండ్లపల్లి మద్యన రెండు, కండ్లపల్లి-మన్నెగూడ మధ్యన రెండు చోట్ల రోడ్డు మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి.
మలుపుల వద్ద మృత్యు ఘోష
జాతీయ రహదారిపై గల రోడ్డు మలుపుల వద్ద మృత్యుఘోష వినిపిస్తూనే ఉంటోంది. గతంలో వికారాబాద్ నుంచి అతివేగంతో దూసుకు వస్తున్న కారు చేవెళ్ల మండలం అంతారం- ఆలూరు మధ్యన రోడ్డు మలుపులో చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
* ఆలూరు-ఖానాపూర్ రోడ్డు మలుపులో ఆలూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందారు.
* ఖానాపూర్-మీర్జాగూడ మలుపు వద్ద కారు బోల్తాపడి ఇద్దరు దుర్మరణం చెందారు.
* బస్తేపూర్ గేట్ వద్ద చేవెళ్లకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో బతికి బటయ పడ్డాడు. అదే స్పాట్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బస్తేపూర్ గ్రామానికి చెందిన గోపాల్ దుర్మరణం చెందాడు.
* దామరగిద్ద వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందాడు.
* ఇబ్రహీంపల్లి గేట్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విద్యుత్ లైన్ మన్ మృతి చెందాడు.
* మల్కాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడంగల్‌కు చెందిన భార్య భర్త అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
* కందాడ స్టేజీ రోడ్డు మలుపులో కారు బోరు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
* మొయినాబాద్ మండలం ఎనికెపల్లి స్టేజి వద్ద గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి పరిధిలోని బీరంగూడకు చెందిన రాంబాబు మృతి చెందాడు. ఇదే స్థలంలో హైదరాబాద్‌కు చెందిన షరీఫ్ మృత్యువాత పడ్డాడు.
* చిన్నషాపూర్ మూల మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో బండ్లగూడకు చెందిన కార్తీక్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ కుమార్ అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
* 2023 డిసెంబర్ 21న పూడూరు మండలం కండ్లపల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఇదే స్థలంలో మూడేళ్లలో 18 మంది మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు.
…………………………………………..
