* కేటీఆర్, హరీష్‌రావులపై కవిత ఆగ్రహం
* అగ్రనేతల అరాచకాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
* హరీశ్‌రావు ఫాంహౌజ్ కోసమే.. ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ మార్పు
* మీడియాతో సంచలన విషయాలు వెల్లడించిన కవిత
ఆకేరు న్యూస్, మెదక్ : కవిత మండిపడ్డారు. బీఆర్ ఎస్ నాయకులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న అగ్రనేతల అరాచకాల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తన చుట్టూ ఓ సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకొని అదే లోకంలో ఉన్నాడని.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును దక్కించుకోలేకపోయారని వాపోయారు. ఇప్పటికైనా ప్రజల మధ్యకు రావాలని సూచించారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉన్న నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఏండ్లు గడిచినా.. మారని బతుకులు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదన్నారు. ‘కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి.. ఒక్కచుక్క కూడా నీళ్లు రాలేదు. జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని.. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యం అని పేర్కన్నారు. హరీశ్‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రశ్నించే శక్తిగా జాగృతి పనిచేస్తోంది’ అని కవిత చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ జాగృతి ముందుంటుందని తెలిపారు.
యువతకు ఉపాధి శూన్యం..
మెదక్ జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవని మెడికల్ సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొడంగల్‌కు తీసుకెళ్లారన్నారు. మెదక్ జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇబ్బంది పడుతోంది’ అని కవిత పేర్కొన్నారు. ‘కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారని… ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో అభివృద్ధి దారుణంగా ఉందని.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉద్యమ కారులను ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేశారు. జంటనగరాలకు అతి దగ్గరగా ఉన్న మెదక్ జిల్లా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కౌడిపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం పేరిట రూ 1.5 లక్షల కిరాయి తీసుకుంటున్నారని.. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్‌ను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. కోటి ఇవ్వాలని.. లేదంటే భూమికి భూమి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణాలో ప్రజలు బీఆర్ ఎస్, బీజేపీని నమ్మే పరిస్థతి లేదన్నారు. కాంగ్రెస్‌ను ఢీకొనే సత్తా కవితకే ఉందన్నారు.
……………………………………………………………..
