* అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మహిళలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల వైఖరి జుగుప్సాకరంగా వుంటుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బిఆర్ఎస్ సోషల్ మీడియా అవమానకరమైన పోస్టులను మరువకముందే తనను, బిజెపి ఎంపి రఘునందన్ రావును కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారంతో ముడిపెట్టి.. బంధాన్ని అంటగట్టి బీఆర్ఎస్ నాయకులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అభ్యంతరకర రీతిలో పోస్టులు చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్స్ చేయడాన్ని నిరసిస్తూ మంత్రి సురేఖ మీడియా ముఖంగా కంటతడిపెట్టారు. తనపై బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టడం పట్ల మంత్రి సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణతో పాటు పక్క రాష్ట్రానికి వెళ్ళినా అన్ని పార్టీల వాళ్లు తనను అక్కా అని, తన భర్త కొండా మురళిని బావ అని ఎంతో గౌరవంగా పిలుస్తారన్నారు. ఓడిపోయామన్న అసహనంతో, నిరాశావాదంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వెనుకుండి సోషల్ మీడియాను పావుగా వాడుకుంటూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని మంత్రి సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతూ, ట్రోలింగ్స్ చేస్తూ బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రాక్షసానందం పొందుతుందని మంత్రి సురేఖ దుఃఖితులయ్యారు. మన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుని నాగరికులుగా ఎదగానికి, గౌరవప్రదంగా బ్రతకడానికి కారణమైన చేనేతలను అవమానించే విధంగా బిఆర్ఎస్ పార్టీ ప్రవర్తించిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. చేనేతలకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా ఇంకా ఇలా అవమానిస్తున్నారని దుఃఖించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎలా విమర్శించినా భరిస్తాం కానీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారేలా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు. ఇలాంటి ట్రోలింగ్స్‌ను మీ తల్లి, చెల్లి హర్షిస్తారా అని మంత్రి సురేఖ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరుగెత్తిస్తామని మంత్రి ఘాటుగా స్పందించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ మహిళలపై కానీ, సమాజంలోని ఏ మహిళ జోలికి వచ్చినా తీవ్ర చర్యలు తీసుకుంటామని.. వారి అంతుచూస్తామని మంత్రి సురేఖ హెచ్చరించారు. చేనేతలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు.
……………………………………