
* చత్తీష్ గఢ్ ఎన్ కౌంటర్లో మావోయిస్ట్ నేత గుమ్మడి వెళ్ళి రేణుక మృతి
* దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు
* జనగామ జిల్లా కడవెండి గ్రామంలో విషాదం
* రేపు సాయంత్రం కడవెండికి రేణుక మృత దేహం
(ఆకేరు న్యూస్-ప్రతినిధి)
వరంగల్ , ఎప్రిల్ 01 : చత్తీష్ ఘడ్లో ఎన్ కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. సోమవారం దంతే వాడ జిల్లాలో మావోయిస్ట్ పార్టీ దళాలకు పోలీస్ లకు మద్య జరిగిన కాల్పుల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడి వెళ్ళి రేణుక అలియాస్ చైతు అలియాస్ దమయంతి అలియాస్ మిడ్కో మృతి చెందిందని పోలీస్‌లు తెలిపారు. రేణుకది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం . దాదాపు 30 ఏళ్ళ క్రితం రేణుక నక్సలైట్ ఉద్యమ బాట పట్టింది. అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలి హోదాలో కొనసాగుతోంది. రేణుక ను పట్టించిన వారికి రూ. 25 లక్షల రివార్డ్ చత్తీష్ ఘడ్ రాష్ట్రం ప్రకటించింది. రాష్ట్ర కమిటీ నాయకురాలిగానే కాకుండా మావోయిస్ట్ పార్టీ ప్రెస్ ఇంచార్జీగా కీలకమైన స్థానంలో కొనసాగుతున్న రేణుక మృతి పెద్ద విజయంగా చత్తీష్ ఘడ్ పోలీసులు భావిస్తున్నారు. ఆమె స్వస్థలం కడవెండిలో మాత్రం విషాధ చాయలు నెలకొన్నాయి. న్యాయ వాద విద్యను అభ్యసించిన రేణుక అనేక అంశాలపై రచనలు కూడా చేశారు.
*నల్ల కొటు నుంచి ఆలీవ్ గ్రీన్ డ్రెస్ వరకు ..
తెలంగాణ సాయుధ పోరాట పురిటి గడ్డ కడవెండికి చెందిన రేణుక బాల్యం నుంచే విప్లవ వాతావరణంలో పెరిగింది. సోదరుడు జీవీకే ప్రసాద్ మావోయిస్ట్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి గూడ్సా ఉసెండీ పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.2014లో తెలంగాణ పోలీసుల ముందు లొంగి పోయారు. ఇపుడు ఒక అంతర్జాతీయ మీడియా తెలుగు చానల్ లో ఢిల్లీ కేంద్రంగా కీలక స్థానంలో ఉన్నారు. మరో సోదరుడు రాజశేఖర్ కూడా గతంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద దాడి కేసులో అరెస్టయి పోలీస్ నిర్భందాన్ని ఎదుర్కొన్నారు. ఎల్ ఎల్ బీ పూర్తి చేసి న్యాయ వాదిగా విశాఖ పట్టణంలో పనిచేస్తున్న రేణుక అలిపిరి ఘటన తర్వాత అడవీ బాట పట్టింది. అంతకు ముందే అప్పటి పీపుల్స్‌వార్ ( ఇప్పటి మావోయిస్ట్ పార్టీ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సంతోష్ రెడ్డి అలియాస్ మహేశ్‌ను పెళ్ళి చేసుకుంది. సంతోష్ రెడ్డి కూడా ఇదే కడవెండి గ్రామానికి చెందిన వాడు. ఆ తర్వాత కాలంలో సంతోష్ రెడ్డి ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. కొద్ది కాలం తర్వాత వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన పీపుల్స్ వార్ నేత శాఖమూరి అప్పారావుతో పెళ్ళి జరిగింది. 2010లో శాఖమూరి అప్పారావు నల్లమలలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందారు.
నల్లకోటు నుంచి అలీవ్ గ్రీన్ డ్రెస్ కు మారిన రేణుక మిలిటరీ కార్యకలాలపాల కంటే మావోయిస్ట్ పార్టీ ముద్రణ, పత్రికా కార్యకలాపాలు ఎక్కువగా చూసేదని తెలుస్తోంది. మావోయిస్ట్ పత్రికల ముద్రణ. పత్రికలకు ప్రకటనలు విడుదల చేయడం లాంటి కార్యకలాపాలు నిర్వహించేదని చెబుతున్నారు. అంతేకాకుండా అనేక అంశాల మీద రచనలు కూడా చేసింది. మిడ్కో పేరుతో ఆమె కథలు రాశారు. దమయంతి పేరుతో అనేక అంశాలకు సంబందించి పత్రికలకు వ్యాసాలు రాసిందని మాజీ మావోయిస్ట్ లు చెబుతున్నారు. దంతే వాడ నుంచి మావోయిస్ట్ నేత రేణుక మృత దేహం కడవెండికి తీసుకువచ్చేందుకు ఆమె సోదరులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్‌లు వెళ్ళారు. మంగళవారం సాయంత్రం వరకు రేణుక మృత దేహం కడవెండికి తీసుకు వస్తామని ఆమె సోదరులు చెప్పారు.
——————————————————————————-