కలెక్టరేట్ ఎదుట బహిరంగ లేఖను ఆవిష్కరించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
ఆకేరున్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సెప్టెంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం మానవ హక్కుల వేదిక సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయాలని కోరుతూ రాసిన బహిరంగ లేఖను వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. అదే సందర్భంగా గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల పైన అమలు చేసిన నిర్బంధాన్ని గుర్తించి ప్రజాస్వామ్య పునరుద్ధరణను ఏడో హామీగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణను ఏడో హామీగా ప్రకటిస్తూ పునరుద్ఘాటించారని గుర్తుచేశారు. నిజానికి తాము, ఈ ఆరు హామీల కంటే కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అయినటువంటి ఏడో హామీ అతి ముఖ్యమైనదని భావిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఏ హామీలు అమలు చేయాలన్నా ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సంస్కృతి అనేది ఒకటి ఉంటే మాత్రమే సాధ్యం అవుతుందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను రక్షించటం, భావ ప్రకటన స్వేచ్ఛను, సభలు, సమావేశాలు జరుపుకునే స్వాతంత్య్రాన్ని, తమకు నచ్చని విషయాలపై తమ నిరసనను తెలియజేసే అవకాశాన్ని కలిగి ఉండటం అని పేర్కొన్నారు. ఇవి గత ప్రభుత్వంలో మృగ్యం అయిన విషయం మనందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ పోలీసుల ప్రవర్తనా శైలిలో ఎటువంటి మార్పు రాకపోవడం ఆందోళన కలిగించే విషయంగా ఉందన్నారు. కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖ కూడా తన వద్దనే ఉంచుకోవడం వల్ల ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్య సంస్కృతిని నిలబెట్టే అవకాశం ఏ ఇతర శాఖ కన్నా పోలీసు శాఖకే ఎక్కువగా ఉందన్నారు. దీనిపై వెంటనే సమీక్ష నిర్వహించి పోలీసుల చట్ట బాహ్య ప్రవర్తనను, యథేచ్ఛగా వారు పాల్పడుతున్న హక్కుల ఉల్లంఘన ఘటనలను సమీక్షించి తగు చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టీ హరికృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వీ దిలీప్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.