* కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యారాలిపై హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. దోషికి జీవిత శిక్ష విధించింది. మరణించే వరకూ జైలులోనే ఉంచాలని ఆదేశించింది. ఆర్జీకార్ వైద్య కళాశాల (RG Kar Hospital) ట్రెయినీ డాక్టర్‌పై లైంగిక దాడి, త్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ (Sanjay Roy)ను న్యాయస్థానం శనివారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి కోల్‌కతాలోని సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషి సంజయ్ రాయ్‌కి జీవితఖైదు (life term) విధించింది. అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించిన సీబీఐ కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన న్యాయస్థానం సంజయ్ రాయ్‌కు శిక్షను ఖరారు చేసింది. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 2024 ఆగస్టు 9న కోల్‌కతా(Kolkata)లోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ తాను నిర్దోషినని, ఈ కేసులో తనను ఇరికించారని చెప్పినట్లు తెలిసింది. తనను ఈ కేసులో ఇరికించిన ఐపీఎస్ అధికారితోసహా అందరినీ ఎందుకు విడుదల చేశారని అతను ప్రశ్నించాడు. ఈ కేసులో సాక్ష్యాలను మార్చినందుకు ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు స్థానిక పోలీసు స్టేషన్ మాజీ ఎస్హెచ్ఓకు బెయిల్ ఇవ్వడాన్ని రాయ్ ప్రశ్నించాడు.
………………………………..