
* ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్ళు తినాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డు దారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన భానోతు మౌనిక కిషన్ నాయక్ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భోజనం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అద్దె ఇంట్లో నివసిస్తూ ఆటో, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉగాదిన ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో ఇలాంటి పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రతా కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. సన్నబియ్యం లబ్దిదారుని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని, సంతృప్తి ఇచ్చిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. భోజన అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మౌనిక. కిషన్ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం కిషన్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలిపారు. ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
……………………………………