
* ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్తం
* షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు : కలెక్టర్ సత్య శారదాదేవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నోటీసులు జారీ అయ్యాయి. బీసీ రిజర్వేషన్ల అమలుపై విచారణ సందర్భంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 23న మొదటి విడత, 27వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 15న ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2 వేల 963 ఎంపీటీసీ, రెండో విడతలో 273 జడ్పీటీసీ, 2 వేల 786 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ల ఎన్నికకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్, మేడ్చల్లో గ్రామ పంచాయతీలు లేనందున, మిగతా 31 జిల్లాల్లోని 565 జడ్పీటీసీలు, 5 వేల 749 ఎంపీటీసీలు, 12 వేల 733 పంచాయతీలు, లక్ష 12వేల 288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 37 జడ్పీటీసీ, 397 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లూ చేశామని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి తెలిపారు. ఫేస్-1లో ఐదు మండలాల నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. నామినేషన్లు ఇచ్చేందుకు వచ్చిన వారికి మెటీరియల్ సిద్ధం చేశామన్నారు. ఇండిపెండెంట్ల కోసం ఫ్రీ సింబళ్ల పోస్టర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత అనంతరం రెండో విడతలో నామినేషన్ల స్వీకరణకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
…………………………………………………………………