
- అర్హులైన ప్రతి పేదవారికి విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
- మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు: పేద ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో బీసీ కాలనీ లో బయ్య ప్రమీల ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తోంది. పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందిఅని మంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………