
హైదరాబాద్ లో వర్షం. భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల హెచ్చరికలు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
*పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
* నిలిచిపోయిన రాకపోకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేటలో 220 మి.మీల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 173 మి.మీల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల (Manchiryala) జిల్లా కన్నెపల్లిలో గంటన్నర వ్యవధిలో 125మి.మీల వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు చుట్టుముట్టగా, సుభాష్‌నగర్‌లో ఓ ఇంటిపై చిక్కుకున్న నలుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ ఎఫ్ సభ్యలు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాసర క్షేత్రం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. జైనథ్ మండలంలో తరోడా వాగు పొంగిపొర్లడంతో వంతెన దాటుతూ చిక్కుకున్న లారీ డ్రైవర్లను జైనథ్ పోలీసులు తాళ్లసాయంతో వెలుపలికి తీసుకొచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్‌గంగా (Penganga) ఉధృతంగా ఉన్నందున ముంపు ప్రాంతాలపై దృష్టిపెట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
ములుగు జిల్లాలో…
ములుగు మండలం బుద్దారం రహదారిలోని రాళ్లవాగు ప్రవాహం ఉధృతంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలో వాగుల ఉధృతితో మూడు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. వాజేడు (vajedu) మండలంలోని బొగత (Bogatha) జలపాతానికి వరద ఉధృతి ఉండడంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. గోవిందరావుపేట (Govondaraopeta) మండలం మేడారం-ప్రసా మధ్య రాష్ట్రీయ రహదారిని బాంబులమోరీ వద్ద వరద నీరు ముంచెత్తడంతో రవాణా నిలిచిపోయింది. ఏటూరునాగారం (Eturunagaram) మండలంలో జంపన్నవాగు ఉధృతితో చెల్పాక-ఎలిశెట్టిపల్లి, దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం (Mahamuttharam) మండలంలో పెగడపల్లి కేశవాపూర్ మధ్యనున్న లోలెవల్ కల్వర్టుపై నుంచి పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో మార్గం బంద్ అయ్యింది. వాగులు ఉధృత ప్రవాహంతో సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ (Medak) జిల్లా ఏడుపాయల్లోని వనదుర్గం ఆలయం ముందు మంజీరా వరదనీరు పో టెత్తడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్నిరాజగోపురంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కడెం జలాశయానికి దిగువన వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు.
వాతావరణ శాఖ హెచ్చరిక
వాతావరణ శాఖ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్, ఖమ్మం, సూర్యపేట, జనగామ, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ , మరో పదకొండు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ప్రకటించింది.
………………………………………..