సామాన్యుడికి ఇసుమెత్తు బంగారమూ కలేనా?
* ఈరోజు ఆల్‌టైం రికార్డు స్థాయికి..
* లక్షా13 వేలు దాటిన 10 గ్రాముల బంగారం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఒకప్పుడు సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా? అని చెప్పుకునే వారు. సొంతిల్లు దేవుడెరుగు.., ఇప్పుడు పిల్లా, పాపలకు ఇసుమెత్తు బంగారం కొనడం కూడా కలేనా అన్నట్లుగా పరిస్థితి మారింది. పాప తొలి పుట్టినరోజుకు కనీసం గ్రాము బంగారం పెడదామనుకున్నా దాదాపు 13000 వెచ్చించాల్సిందే. సామాన్యుడు ఇక రింగులు, చెయిన్ల ఊసు మరచిపోవాల్సిందే. ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధర.. అంటూ మీడియాలో ఘనంగా పలికే పలుకులు.. పేద, మధ్యతరగతి వాసులకు ఉసూరుమనిపిస్తున్నాయి. పిల్లా, పాపల ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు కనీస స్థాయిలో కూడా పసిడి పెట్టలేం కదా.. అంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకంతకూ పసిడి ధర ఎగబాకుతుండడమే అందుకు కారణం.
10 గ్రాములు రూ.1.13 లక్షలు
ఈరోజు పది గ్రాముల మేలిమి బంగారం ధర లక్షా 13వేలకు చేరింది. సెప్టెంబర్ తొలి వారం నుంచే బంగారం ధర మరింత పెరుగుతూ వస్తోంది. తొలివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 1.2 లక్షలు దాటింది. పండుగల సీజన్ దగ్గర పడుతున్నందున, బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పెట్టుబడిదారులు మరియు సాధారణ కొనుగోలుదారులు అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిరత, అమెరికన్ విధానాలు వంటి కారణాల వల్ల బంగారం కొనుగోలు పెంచడంతో ఈ ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన పెట్టుబడులకు బంగారం ఓ మార్గం కావడం కూడా ధరల పెరుగుదల కారణం. అయితే.. ఈ ధరల పెరుగుదలతో సాధారణ కొనుగోలుదారులు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.
20 రోజుల్లో 13 వేలు పెరుగుదల
ఆగస్ట్ 20 నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్ట్ 20న 22 క్యారట్ గోల్డ్ ధర రూ.91,800 ఉండగా, ప్రస్తుతం రూ.1,01,100 ధరలో ఉంది. అప్పటి నుంచి రోజుల్లో రూ.9,300 పెరిగింది. ఇక అదే రోజు స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,00,150 ఉండగా ఈరోజు లక్షా 13 వేలకు చేరింది. అంటే 20 రోజుల్లో ఏకంగా పది గ్రాముల బంగారం ధర 13 వేలు పెరిగింది. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1360 పెరిగి రూ.1,08,930 నుంచి రూ.1,10,290కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1250 పెరిగి రూ.99,850 నుంచి రూ.1,01,100కి చేరుకుంది. ఇక 18 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1020 పెరిగి రూ.81,700 నుంచి రూ.82,720కి చేరుకుంది.
………………………………………………….
