
ఆకేరు న్యూస్, భద్రాచలం : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం గోదావరి నదిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
వేగంగా పెరుగుతున్న నీటి మట్టం
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు . కాగా, గోదావరి నీటి మట్టం గురువారం ఉదయం 21 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది. సీతవాగులోకి నీరు చేరింది. దీంతో నార చీరల ప్రాంతానికి పర్యటకులను వెళ్లకుండా ఆపివేశారు. ప్రజలు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల
వరద ఉధృతి తగ్గించేందుకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటిని అధికారుల పర్యవేక్షణలో నియతంత్రణగా విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 14,931 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఈ నీరు గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని మరింత పెంచే అవకాశముంది.
………………………………………………