
* తర్వాతి స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
* దాదాపు అభ్యర్థిని ఖరారు చేసినట్లే
* హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్
* సీల్డ్ కవర్ లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి
ఆకేరు న్యూస్, సండే స్టోరీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఈ ఒక్క ఎమ్మెల్యే సీటుతో ప్రభుత్వం పడిపోదు.. కొత్త ప్రభుత్వం రాదు కానీ.. భవిష్యత్ లో ఆ అవకాశానికి ఇది నాందిగా ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. దీంతో ఏ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. ప్రధానంగా ప్రధాన పార్టీ కాంగ్రెస్‌పైనే అందరి ఫోకస్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా హైదరాబాద్‌లో మాత్రం ఒక్క సీటూ సాధించలేకపోయింది. ఈనేపథ్యంలోనే పార్టీ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే అభ్యర్థి ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తోంది. మూడంచెల్లో సర్వేలు పూర్తి చేసింది. అభ్యర్థి ఎంపికకు ఓ కమిటీ కూడా వేసింది. అందులో కీలక మంత్రులను సభ్యులుగా ఉంచింది.
ఎందరో ఆశావహులు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి నియమించిన కమిటీలోని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకట స్వామిలు ఎన్నో దఫాలుగా ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వేలను క్షుణ్నంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు నివేదికలను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అక్కడి నుంచి ఢిల్లీకి కూడా నివేదికలు పంపినట్లు తెలిసింది. కానీ ఇప్పటి వరకు అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజారుద్దీనే మరోసారి పోటీలో ఉంటారని తొలుత అందరూ భావించారు. తానే అభ్యర్థినంటూ ఆయన కూడా స్వయంగా ప్రకటించారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి పార్టీ పోటీ నుంచి తప్పించింది. అయితే ఆ తర్వాత ఆశావహుల సంఖ్య మరింత పెరిగిపోయింది.
ఆలస్యం.. అమృతం..
పలుమార్లు నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చాలా మంది పోటీకి సిద్ధమయ్యారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి వారైతే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. హోర్డింగులు పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థి ఎంపికను చివరిదశకు తెచ్చింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, బీఆర్ ఎస్ ప్రచారంలో ముందంజలో ఉండడంతో ఇంక ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది.
అభ్యర్థి ఎవరంటే..?
సర్వేలు, స్థానిక ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ చివరకు ముగ్గురు పేర్లను ఓకే చేసింది. వారిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ ఉన్నారు. అనూహ్యంగా రెహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు కూడా వచ్చి చేరినట్లు తెలిసింది. అన్నీ ఓకే అయితే రేపే అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించనుంది. అయితే సర్వేలు, స్థానిక ప్రజాభిప్రాయాలు నవీన్ యాదవ్ కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఆయననే పార్టీ అభ్యర్థిగా ప్రకటించే చాన్స్ ఉంది. లేదంటే బొంతు రామ్మోహన్ రేసులో ఉన్నారు. పైస్థాయిలో ఏమైనా మంతనాలు జరిపి ఎవరైనా చక్రం తిప్పతే తప్ప వీరిలో ఒకరే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా నిన్న హైదరాబాద్‌కు విచ్చేశారు. పార్టీ కీలక నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తేలింది. ఇక సీల్డ్ కవర్ తెరవడమే తరువాయి. ఏం జరగనుందనేది దాదాపు రేపే తేలిపోనుంది.
……………………………………………………….