* స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన సమరనాదం
* నేటి నుంచి 150 ఏళ్ల ఉత్సవాలు
* ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ
* స్మారక స్టాంపు, రూ.150 కాయిన్ విడుదల
ఆకేరు న్యూస్, డెస్క్ : స్వాతంత్య్ర ఉద్యమంలో దేశమంతా మార్మోగిన రణన్నినాదం వందేమాతరం. ప్రతీ భారతీయుడిని మేల్కొలిపిన సమర నాదం. బ్రిటిష్ సామ్రాజ్యవాద బానిస సంకెళ్ల నుంచి విముక్తి ఉద్యమంలో వాడవాడలా వినిపించిన ఈ నినాదానికి నేటితో 150 ఏళ్లు. బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబరు 7న రచించిన ఈ సంస్కృత గీతం వందేమాతరం. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. బ్రిటిష్ వలసవాదులపై పోరాటాన్ని ప్రేరేపించిన ఈ గీతాన్ని, 1896లో కలకత్తాలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ మొదటిసారిగా ఆలపించారు. దీని గొప్పతనాన్ని గుర్తించి, 1937లో భారత రాజ్యాంగ సభ.. దీనిని జాతీయ గీతంగా ఆమోదించింది. జన గణ మన గేయంతో కలిసి.. ఈ గీతం.. జాతీయ స్వరంగా మారి.. దేశ గొప్పతనాన్ని చాటిచెప్పింది. అహింసాయుత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్ర వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ నవల ఆనందమఠ్ లో భాగంగా 1882లో దీన్ని మొదటిసారి ప్రచురించారు.
150 ఏళ్ల ఉత్సవాలు
నేటి నుంచి ‘వందే మాతరం’ 150 ఏళ్ల ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ స్మారకోత్సవం పేరుతో 150 ఏళ్ల ఉత్సవాలను ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాసేపటి క్రితం ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపించారు. నాలుగు దశల్లో ఈ ఉత్సవాలను నిర్వహించాలని కేంద్రం ప్రణాళిక రచించింది. ఈ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని.. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ వివిధ శాఖలను కోరింది. ఈసందర్భంగా స్మారక స్టాంపు, రూ.150 కాయిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.అంతేకాకుండా వందేమాతరం 150.ఇన్ పేరుతో వెబ్ సైట్ను ప్రారంభించారు.
ఢిల్లీలో సామూహిక గీతాలాపనలో భాగంగా ఒక్కసారి ఆ మహద్భుగీతం..
వందేమాతరం..
వందేమాతరం..
సుజలాం సుఫలాం మలయజ శీతలమ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
మి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
ఇదీ అర్థం..
వందేమాతరం.. తల్లీ నీకు నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనం కలిగి, సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను. తెల్లని వెన్నెలతో పులకించిన రాత్రులు కలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించు దరహాసములతోనూ, మధుర భాషణంలతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి..! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా..! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ…! నీకు నమస్కరించుచున్నాను.
నీవే విద్య, నీవే ధర్మం, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే..! తల్లి…! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే..! మా హృదయ మందిరంలలో వెలసిన ప్రతిమవు నీవే…! నీకు నమస్కరించుచున్నాను.
పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే…! పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే..! విద్యా దాత్రియైన శారదవు నీవే….! కమలా..! అమలా…! అతులా…! సుజలా…! సుఫలా…! శ్యామలా…! సరళా…! సుస్మితా…! అలంకృతా…! (మమ్ము) భరించుమాతా…! భూమాతా…! నీకు నమస్కరించుచున్నాను.
