* బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా కీ అదాలత్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల ప్రేమ, మద్దతు, నమ్మకమే నా నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు. యూపీలో గత ఏడేళ్లుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని.. అక్కడ విఫలమయ్యారన్నారు. 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని.. ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం పేరు చెప్పమని వారిని అడగాలన్నారు. గుజరాత్లో 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారని.. అక్కడ ఒక్క బడిని కూడా బాగు చేయలేదంటూ విమర్శించారు. అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయని.. అక్కడ చేసిన మంచి పని ఒక్కటి చెప్పాలన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్ అవుతారన్నారు. ఢిల్లీలో చేసిన ఏ ఒక్క పనైనా 22 రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలో చేయాలన్నారు. పదేళ్లలో చేసింది ఏమీ లేదని.. 11వ సంవత్సరంలోనైనా ఏదో చేశారనుకుంటారన్నారు. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని తాను ప్రధానికి చెబుతున్నానని.. ఫిబ్రవరిలో 22 రాష్ట్రాల్లో ఒక్కడో ఒక చోట ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. అలా చేస్తే తానే ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తానన్నారు. ఢిల్లీ సీఎం అతిషీ మాట్లాడుతూ అత్యంత వేడిలోనూ 24 గంటలు కరెంటు అందుబాటులో ఉన్న ఏకైక ప్రదేశం ఢల్లీి మాత్రమేనన్నారు. అయినా బిల్లులు జీరో వచ్చాయన్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అని.. బీజేపీ వ్యతిరేక పార్టీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మురికివాడలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తోందన్నారు. ఆరు నెలల కిందట వృద్ధాప్య పింఛను నిలిపివేసిందని విమర్శించారు.
……………………………..