* డ్రామాలంటున్న తెలుగుదేశం
* జగన్ ను చంపేందుకు కుట్ర అంటున్న వైసీపీ
* అప్పుడూ.. ఇప్పుడూ ఎన్నికల ముందే ఘటనలు
* జగన్ కు దాడి మళ్లీ కలిసిరానుందా?
ఆకేరున్యూస్ ప్రతినిధి, విజయవాడ:
‘‘ప్రజాదరణను చూసి ఓర్వలేక.. జగన్ జనాల్లో ఉండకూడదని చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఎయిర్‌గన్ లాంటి ఆయుధంతో దాడి చేశారు. నాడు కోడికత్తితో చంపాలని చూశారు.’’
– జగన్ తాజా ఘటనపై వైఎస్ ఆర్సీపీ నేతలు.
‘‘ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారు. ఇది కోడికత్తి 2.0. జగన్‌పై జరిగిన రాళ్ల దాడి కుట్రలో భాగమే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీకి పట్టుకుంది. ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాకు తెరలేపింది ’’
– జగన్ పై దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు.
ఇది పక్కా ప్లాన్ అంటున్న సజ్జల..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్ కన్ను కు గాయం కావడంపై ఏపీ అట్టుడుకుతోంది. ఓ వైపు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా ఆందోళనలు చేపడుతున్నారు. జగన్ ను చంపేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలకు పాల్పడుతోందని వైసీపీ కార్యకర్తల నుంచి ప్రముఖ నేతల వరకూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు మీడియా ముఖంగానే టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇది పక్కా కోల్డ్ బ్లడెడ్ అటాక్ ప్లాన్ అన్నారు.
చంద్రబాబే చేయమన్నారా..?
అలాగే.. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. “జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం, గురిచూసి కొట్టాలని చూశారు. సీఎం జగన్ కదలడం వలన గురి తప్పి కన్ను వద్ద తగిలింది. సీఎం మీద దాడి జరిగిందంటే దీనివెనుక చాలా మంది పెద్దలున్నారు. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో జరిగిన సభలో జగన్‌ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్నారు. వీడియోలు నా వద్ద ఉన్నాయి. చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్‌ను చంపడానికి ప్రయత్నించారు. ఎంత వేగంగా వస్తే జగన్‌కు తగిలి మళ్లీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయమవుతుందా?. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు జరిగింది”అని కొడాలి నాని ఆరోపించారు. సజ్జల, కొడాలి వీరే కాదు.. రోజా, అంబటి తదితర వైసీపీ నేతలు కూడా జగన్ హత్యకు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వారి ఆరోపణలను కొట్టి పారేస్తోంది. ఓడిపోతామన్న భయంతోనే కోడికత్తి డ్రామాలకు తెరలేపారని అంటున్నారు.
2019లో ఎన్నికలకు 5 నెలల ముందు..
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కత్తితో దాడి చేశారు. భుజం గాయంతో జగన్ అలాగే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్‌లోనే తన గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో జనుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. సంఘటన స్థలంలోనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోడి పందేలలో వాడే కత్తిగా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కోడికత్తి అనే పదం వాడటం రాజకీయాల్లో అలవాటుగా మారింది.
2024లో ఎన్నికలకు నెల ముందు..
విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో ఉన్న సీఎం జగన్ పై నిన్న దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా.., సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఉన్న పాఠశాల పై నుంచి రాయి దూసుకు వచ్చి జగన్‌కు తాకింది. దీంతో ఆయను ఎడమ కనుబొమ్మపై గాయమైంది. పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయమైంది. అది దూసుకొచ్చిన వేగం, గాయమైన తీరును పరిశీలిస్తే అది చేతితో విసిరిన రాయి కాదని, ఎయిర్ గన్ లాంటి ఆయుధంతో షూట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్లో దీనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.
అప్పుడూ.. ఇప్పుడూ.. ఎన్నికల ముందే..
జగన్‌పై కోడికత్తిదాడి, తాజా ఘటన.. రెండూ అసెంబ్లీ ఎన్నిలకు ముందే జరగడం.. చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు సానుభూతికోసమే జగన్ నాటకాలాడుతున్నారని విమర్శిస్తున్నాయి. నాటకాలు ఆడాల్సిన అవసరం జగన్ కు లేదని, ఎన్నికల్లో వైసీపీకి మామూలుగానే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని సజ్జల చెబుతున్నారు. ఏదేమైనా రెండు ఘటనలూ ఎన్నికల ముందే జరగడంతో సాధారణ ప్రజానీకంలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. కాగా, నాడు కోడికత్తి గాయం జగన్ కు కలిసి వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు కన్నుకు గాయమైంది. ఈ ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
————–
Superb article