* రంగారెడ్డి జిల్లా దుర్ఘటనకు నిర్లక్ష్యమే కారణమా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా 19 మందిని పొట్టనబెట్టుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 24 మందికి తీవ్రగాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంతటి దుర్ఘటనకు కారణం నిర్లక్ష్యం. అతివేగంతో వాహనం నడపడం.., కంకరపై టార్పాలిన్ కప్పకపోవడం డ్రైవర్ నిర్లక్ష్యం అయితే.., ఇదే రోడ్డుపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా తగిన చర్యలు తీసుకోకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. రోడ్డును విస్తరించండి.. అంటూ స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. గతంలో అదే స్పాట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా స్పందించలేదు. అదే స్థానిక ఎమ్మెల్యె కాలె యాదయ్య కు నిరసన సెగ తగలడానికి కారణమైంది. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ స్థానికులు ఎమ్మెల్యేను వెనక్కి పంపేశారు.
అదే ప్రాంతం.. ఎన్నో ప్రమాదాలు..
ఈరోజు తీవ్ర విషాదం చోటుచేసుకున్న రోడ్డుపైనే గతంలోనూ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనకు ఒక రోజు ముందు మీర్జాగూడ గేట్ దగ్గర కారు, బైక్ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఈ ఏడాది ఆగస్టు 26న చేవెళ్ల బస్టాండ్ దగ్గర, సిమెంట్ లారీ, బైక్ను ఢీకొట్టి తళ్లీకూతుళ్లు మృతి చెందారు. పరిగి-రంగాపూర్ రహదారిలో పెళ్లి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోగా, 20మంది గాయాలపాలయ్యారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఆలూరు గేట్ దగ్గర వేగంగా వస్తున్న లారీ కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.ఇలా 2018 నుంచి జరిగిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 200 మందికి పైగా చనిపోయారు. 600 మందికి పైగా తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రోడ్డు విస్తరణకు అవాంతరాలు..
ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని గతంలో నాటి ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుత రేవంత్ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టినా స్థానిక రాజకీయాలతో రోడ్డు పనులకు బ్రేక్ పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, NH 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే, ఈ రహదారికి ఇరువైపులా చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్ పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.
…………………………………………
