* బలహీనపడి తుఫాను గా కొనసాగింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ప్రభుత్వ కృషి.. అధికారుల అప్రమత్తతో ప్రాణనష్టం తప్పినా, భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. చాలా మంది జలదిగ్భందంలో చిక్కుకున్నారు. దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నంద్యాలలో చామ కాలువకు వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో ఫక్కీర్ పేట, సుందరయ్య నగర్, సలీంనగర్, విశ్వనగర్, భగత్‌సింగ్ కాలనీల్లోకి వరద చేరింది. వరదల వల్ల విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనాలు నిలిపివేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు దగ్గర ప్రైవేట్ బస్సు వరదలో చిక్కుకుంది. ఒంగోలు నుంచి కర్నూలు మధ్య రోడ్డును ముంచెత్తిన పేర్నమిట్ట చెరువు వరదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మొంథా బలహీనపడి తుఫాను గా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
తప్పిన తీవ్ర ముప్పు
మొంథా తీవ్రమైన ముప్పు ప్రస్తుతం తప్పినట్లే కనిపిస్తోంది. తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడిన వాయుగుండం తుఫానుగా కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటికి వాతావరణం సాధారణస్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య మొంథా తీవ్ర తుపాను తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీన పడనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. స్వల్ప నష్టంతోనే కోనసీమ జిల్లా బయటపడడం ఊరటనిచ్చింది.
తీవ్రమైన కుదుపు..
మొంథా తుఫాను ఏపీని కుదిపేసింది. కోనసీమ జిల్లాలో 143 చెట్లు కూలిపోయాయి. 30 గృహాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు కోనసీమ జిల్లాలో 5,091 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమ అంతటా తీవ్రమైన గాలులు, వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తపేట మండలంలోని పలివెల గ్రామ పరిధిలోని కోటమెరకలో శతాబ్దాల నాటి మహా రావి వృక్షం బలమైన గాలులకు తట్టుకోలేక వేళ్లతో సహా పూర్తిగా నేలకొరిగింది. తుఫాను వేగం పెరిగిన సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థుల్లో ఆందోళన కలిగించింది. రాజమండ్రి ధవళేశ్వరంలో గోడ కూలి ఆటోపై పడడంతో డ్రైవర్‌కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అనపర్తి, రాజానగరం, బొమ్మూరు, కడియం మండలాల్లో చెట్లు నేలకొరిగాయి. అనపర్తి నల్లకాలువ వంతెనపై చెట్లు కూలిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాల్లో పంట నష్టం జరిగింది. బిక్కవోలు మండలంలో 2,550 హెక్టార్లలో, రాజానగరం మండలంలో 253 హెక్టార్లు, రంగంపేటలో 326 హెక్టార్లు, కడియంలో 285 హెక్టార్లలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాజానగరం మండలంలో 28 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం సంభవించింది.
జలమయం.. రాకపోకలు బంద్
మొంథా ముప్పుతో చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆత్మకూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలు- గుంటూరు రోడ్డుపై వరద, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరద ప్రవాహం కొసాగుతోంది. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో కుండపోత వర్షం కొనసాగుతోంది. వరదరాజ స్వామి ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేశారు. నీటి ప్రవాహం కారణంగా కొత్తపల్లి వైపు వెళ్లే 30 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సిద్దాపురం చెరువు పూర్తిగా నిండడంతో రోడ్డుపై పారుతోంది. దీనివల్ల ఆత్మకూరు నుంచి దోర్నాల వెళ్లే రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనాలను దోర్నాల నంద్యాల మీదుగా మళ్లించారు.
నేలకొరిగిన శతాబ్దాల నాటి రావి వృక్షం
మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమ అంతటా తీవ్రమైన గాలులు, వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తపేట మండలంలోని పలివెల గ్రామ పరిధిలోని కోటమెరకలో శతాబ్దాల నాటి మహా రావి వృక్షం బలమైన గాలులకు తట్టుకోలేక వేళ్లతో సహా పూర్తిగా నేలకొరిగింది. తుఫాను వేగం పెరిగిన సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థుల్లో ఆందోళన కలిగించింది.
పునరావాస కేంద్రాల్లోనే..
ఒంగోలు జిల్లా అంతటా ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తుఫాను తీవ్ర ప్రభావిత ప్రాంత ప్రజలను ముందస్తుగానే ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో 60 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్థవీడు మండలంలో జంపలేరు వాగు ఉధృతికి 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గిద్దలూరు మం. వెంకటాపురం దగ్గర ఎనుమలేరు ఉధృతికి రాచర్ల మం. చల్లవీడు-ఆకవీడు మధ్య నిలిచిన రాకపోకలు ఆగిపోయాయి. మార్కాపురంలో పలు గ్రామాలకు కూడా అదే పరిస్థితి. గుండ్లకమ్మ ఉధృతికి మార్కాపురం-కంభం రోడ్డులో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరు జిల్లా సంగం పెన్నా వారధి దగ్గర ముప్పు తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. నదిలో ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన 3 పడవలు తాళ్లు తెంచుకుని పెన్నా నది గట్టున ఆగిపోయాయి. పెన్నా వారధి గేట్లకు బోట్లు తగలకపోవడంతో ప్రమాదం తప్పింది.
………………………………………………………
