
సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ..
* మేనమామ రాంరెడ్డి అడుగు జాడల్లో అడవి బాట
* మిలిటరీ దాడుల వ్యూహకర్త
* కష్ట కాలంలో మావోయిస్ట్ పార్టీ సారథ్య బాధ్యతలు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : సీపీఐ మావోయిస్ట్ పార్టీ దళపతిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నియమితులైనట్లుగా తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మిలిటరీ కమిషన్ చీఫ్ గా తిరుపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్లో సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటి కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. ఆయన స్థానంలో ఇప్పుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నియామకం అయినారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన గంగుబాయి, వెంకట నర్సయ్య ల కుమారుడే ఈ తిరుపతి. 1984 లో డిగ్రీ చదువు మద్యలో వదిలేసి అజ్ఞాతం వెళ్ళారు. కొంత కాలం విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొంత కాలం ఆర్గనైజర్‌గా పనిచేసినట్లుగా చెబుతున్నారు. అనంతరం చత్తీష్ గఢ్ లో సుదీర్ఘ కాలంగా మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
కేంద్ర కమిటి కార్యదర్శి గా తిప్పిరి తిరుపతి నియామకం గురించి సీపీఐ మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించక పోయినప్పటికీ ఇటీవలి కాలంలో పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్ట్ నేతలు ఇచ్చిన సమాచారం ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి కీలకమైన నియామకాలు జరిగినప్పుడు మావోయిస్ట్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేస్తుంది. వరుస నష్టాల వల్ల మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న నిర్బందం వల్ల పత్రికా ప్రకటన విడుదల చేయక పోవచ్చన్న అభిప్రాయాన్ని మావోయిస్ట్ మాజీ నేతలు వెలిబుచ్చుతున్నారు.
* మావోయిస్ట్ పార్టీ దళపతి దళితుడే..
సీపీఐ మావోయిస్ట్ పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టిన తిప్పిరి తిరుపతి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. మావోయిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో ఇప్పటి వరకు కొద్ది కాలం మినహా అగ్ర కులాలకు చెందిన వారే నాయకత్వంలో ఉన్నారు. మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందనప్పుడు అప్పటి సీపీఐ ఎం ఎల్ పీపుల్స్‌వార్ పార్టీ కేంద్ర కమిటి కార్యదర్శి కొండ పల్లి సీతారామయ్య అరెస్టయి జైళ్ళో ఉన్నప్పుడు కొంత కాలం దళిత సామాజిక వర్గానికే చెందిన కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్ కొండపల్లి సీతారామయ్య స్థానంలో కార్యదర్శిగా పనిచేశారు. కొండ పల్లి సీతారామయ్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వార్ పార్టీకి వెలమ సామాజిక వర్గానికి చెందిన ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సుదీర్ఘ కాలం మావోయిస్ట్ పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహించారు. వయసు రీత్యా ఆయన పదవి నుంచి తప్పుకున్న తర్వాత మావోయిస్ట్ పార్టీ మిలటరీ కమిషన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న క్షత్రియ వర్గానికి చెందిన నంబాళ్ళ కేశవరావు చేపట్టారు. నంబాళ్ళ కేశవరావు ఇటీవల ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో ఆయన స్థానంలో మావోయిస్ట్ పార్టీ మిలటరీ కమిషన్ చీఫ్ గా ఉన్నదళిత సామాజిక వర్గానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కేంద్ర కమిటి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా తెలుస్తోంది.
* మేన మామ అడుగు జాడలో ..
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన తిప్పిరి తిరుపతి పై మేనమామ రాంరెడ్డి ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సైతం కోరుట్ల , మెట్ పల్లి ప్రాంతాల్లో రెడ్డి అనే పేరుకు చివర పెట్టుకుంటారని చెబుతున్నారు. రాం రెడ్డి అలియాస్ దీపక్ పీపుల్స్ వార్ పార్టీలో రాష్ట్ర కమిటీ నాయకుడు. చాలా కాలం క్రితం ఎన్ కౌంటర్లో మరణించారు. రాంరెడ్డి సతీమణి వసంత అలియాస్ శాంత సైతం సుదీర్ఘ కాలం చత్తీష్ గడ్‌లో పనిచేసి ఇటీవలనే ఇటీవలనే చత్తీష్ ఘడ్ పోలీసుల ముందు లొంగిపోయారు. మేన మామ రాంరెడ్డి ప్రభావం వల్ల తిరుపతి హైస్కూల్ చదువులో ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాల్లో పాల్గొనేవాడంటున్నారు. ఇంటర్ మీడియట్ చదువుతున్న కాలంలో రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూనే నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. అంచెలంచెలుగా ఎదిగి ఇపుడు మావోయిస్ట్ పార్టీ సారథిగా బాధ్యతలు చేపట్టారు.
* మిలిటరీ దాడుల వ్యూహ కర్త
తిప్పిరి తిరుపతి సంచలన దాడులకు కేరాఫ్ గా చెప్పుకుంటారు. మావోయిస్ట్ పార్టీ చేసిన మిలిటరీ దాడుల్లో తిరుపతి కీలక భూమిక పోషించాడంటారు. చత్తీష్ గడ్‌లో జరిగిన భారీ దాడులు వెనుక తిరుపతి ఉన్నాడంటారు. మిలటరీ పరంగానే కాకుండా ఆర్గనైజర్‌గా మంచి పేరుందని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. నిరంతర అధ్యయనం తో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా వ్యాసాలు రాసేవాడని అంటున్నారు. వరుస ఎన్ కౌంటర్లతో భారీ నష్టాన్ని చవి చూస్తున్న సీపీఐ మావోయిస్ట్ పార్టీ సరికొత్త సారథి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నేతృత్వంలో ఎలాంటి వ్యూహాలతో ముందడుగు వేస్తుందున్నది వేచి చూడాల్సిందే..
……………………………………….