* దారి పొడవునా ప్రజలతో పలకరింపులు
* చిన్నారులకు ఆటోగ్రాఫ్‌లు
* ఎండలకు జాగ్రత్త.. నీళ్లు బాగా తాగాలని మోదీ సూచన
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పది రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్లారు. గుజరాత్ కు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నగర్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోడీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
చిన్నారిని ఎత్తుకుని ఆడించిన మోదీ
ఓటు వేసేందుకు వచ్చిన మోదీ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పకలరించారు. కరచాలనాలు చేశారు. తన ముఖచిత్రాలను గీసి ఇచ్చిన చిన్నారులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఓ అంధురాలైన యువతితో మాట్లాడారు. ఆమె ఆప్యాయంగా మోదీని తాకుతుండగా సెక్యూరిటీ అడ్డుకోబోయారు. దీంతో మోదీ సెక్యూరిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తల్లి ఒడిలోని చిన్నారిని ఎత్తుకున్నారు. అంతేకాదు.. చిన్నారిని పైకి ఎగరేస్తూ, అటూ ఇటూ ఊపుతూ ఆడించడం ఆసక్తిగా మారింది. తన బిడ్డతో మోదీ ఆప్యాయంగా ఆడడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు.
ఎక్కువ మంది ఓటెయ్యండి..
బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఎండల్లో జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు.
———————————-