తమ్ముడు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి వినతి
* తమ్ముడి కోసం వీడియో రిలీజ్ చేసిన అన్న
* అలాంటి గొంతు చట్టసభల్లో వినిపించాలి
* పిఠాపురం ప్రజలు గ్లాజు గుర్తుకు ఓటేయాలని వినతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమ్ముడు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలని తొలిసారిగా తన గొంతు వినిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల జనసేన పార్టీకి 5 కోట్లు విరాళం ఇచ్చిన ఆయన.. ఇప్పుడు జనసేనానిని గెలిపించాలని ప్రచారం చేపట్టారు. తమ్ముడు పవన్ కోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి ఏమన్నారంటే.. ‘‘కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా.. జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే.. ఎదుటి వారికి మంచి కలగాలనే మనస్తత్వం తమ్ముడు కల్యాణ్బాబుది. ఎవరైనా ప్రజలకు గెలిచాక.. ఏదైనా చేయాలని అనుకుంటారు.. కానీ కల్యాణ్.. తన సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు.. సరిహద్దుల్లో పోరాడే జవానుల కోసం పెద్దమొత్తంలో అందించడం.. మత్స్యకారులు ఇలా ఎందరికో తను చేసిన సాయం చూస్తుంటే.. ఇలాంటి నాయకుడు కదా.. జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లి కైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఓ మాట చెప్పాను. నీ కొడుకు.. ఎంతో మంది తల్లుల కోసం, వారి పిల్లల భవిష్యత్ కోసం చేసే యుద్ధం అమ్మ ఇది. మన బాధ కంటే.. అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతుందని, జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే, చట్టసభల్లో ఆ గొంతు మనం వినాలి. జనమే ధ్యేయం అనే జనసేనాని ఏంచేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా ఉంటాడు.. మీకోసం కలబడతాడు.. మీ కలలను నిజం చేస్తాడు.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. జైహింద్’’ అని పవన్‌కు చిరంజీవి మద్దతుగా నిలిచారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
