* చంద్రబాబు ఆదిశగా ఆలోచిస్తారా?
* పదవులకే ప్రాధాన్యమిస్తారా?
* ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజారిటీ కరువు
* కింగ్ మేకర్‌గా బాబు
* సద్వినియోగం చేసుకోవాలంటున్న మేధావులు
* ఆశగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు
ఆకేరు న్యూస్ డెస్క్ :
ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయేతో విభేదించాను. తెలుగుదేశాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రాన్ని డిమాండ్ చేసి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తా..
– గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు.
జగన్ ను నమ్మి భారీ మెజారిటీ కట్టబెట్టారు.. ప్రత్యేక హోదా తెచ్చాడా..? – ఈ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు చంద్రబాబు నాయుడి ప్రశ్న.
కేంద్రంలో బీజేపీకి మెజారిటీ తగ్గి.. మనమీద ఆధారపడే పరిస్థితి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గట్టిగా అడిగే చాన్స్ ఉంటుంది..
– ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు(Chandrababu Naidu) ఇప్పుడు ఆ చాన్స్ వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గల మెజారిటీ సీట్లు రాకపోవడం కలిసిరానుంది. ప్రత్యేక హోదా కోసమే 2014లో ఎన్డీయేతో విభేదించి బయటకు వచ్చానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. అదే ప్రత్యేక హోదా(Special Category Status) ఇస్తేనే.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పేందుకు అవకాశం ఉంది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 చోట్ల కూటమి విజయం సాధించింది. సొంతంగా టీడీపీ 16 స్థానాలు పొందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో బీజేపీ అగ్ర నేతలు ఆయనకు అధిక ప్రాధాన్యమివ్వక తప్పదని జాతీయ మీడియా కోడైకూస్తోంది. అది వాస్తవం కూడా. ప్రత్యేక హోదానే కీలకమని బాబు భావిస్తే.. దాని గురించి పట్టుపట్టేందుకు ఇదే మంచి అవకాశమని మేధావులు సూచిస్తున్నారు.
కేంద్రంలో చక్రం తిప్పే చాన్స్
కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. చాలాకాలం తరువాత కేంద్రప్రభుత్వంలో దక్షిణాది వ్యక్తికి చక్రం తిప్పే అవకాశం వచ్చిందని జాతీయ మీడియా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలక భూమిక పోషించిన ఆయన.. వాజపేయి హయాంలోనూ ఎన్డీయే కన్వీనర్‌గా చక్రం తిప్పిన వైనాన్ని జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తోంది. 2014లోనూ ఎన్డీయేలో ఉన్నా.. ప్రత్యేక హోదాపై విభేదించి బయటకు వెళ్లిపోయిన వైనాన్ని గుర్తుచేస్తోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై రాజకీయ విశ్లేషకులు జాతీయ చానళ్లలో పలురకాలు విశ్లేషణలు చేస్తున్నారు.
నెరవేరని మోదీ ఆశలు
మూడోసారి ప్రధాన మంత్రి అయి చరిత్ర సృష్టించాలని ఆరాటపడ్డారు నరేంద్ర మోడీ(Narendra Modi). భారత దేశ తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమం చేయాలని పరితపించారు. కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ తాజాగా వెల్లడయిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తేడా కొట్టాయి. కేవలం 240 స్థానాల్లో మాత్రమే బీజేపీ జెండా ఎగురవేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 304 స్థానాలను దక్కించుకుంది. కానీ ఈసారి గతంతో పోల్చుకుంటే 66 స్థానాలు తగ్గాయి. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 272గా ఉంది. దేశంలోని అతి ఎక్కువ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ బీజేపీ పావులు అక్కడ పారలేదు. గతంలో అక్కడ దక్కించుకున్న సీట్ల కంటే ఈసారి సగానికి సగం సీట్లు తగ్గాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఇదే పరిస్థితి ఎదురయింది.
చంద్రబాబు.. పవన్ సాధిస్తారా?
ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు(Pavan Kalyan) కింగ్ మేకర్లుగా మారారు. టీడీపీ వద్ద 16 మంది, జనసేన వద్ద ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ 18 ఎంపీల బలం ఎంతో కీలకం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్ధతు ఇవ్వకపోతే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కింగ్ మేకర్లు అయ్యారు. అందరి దృష్టి అంతా వారిపైనే ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలకంగా మారిన చంద్రబాబు, పవన్.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తీసుకొస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకొని వస్తారా అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సద్వినియోగం చేసుకోవాలి : మేధావులు
ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు.. కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేసే అవకాశం ఉందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా కూడా కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదా లేకుంటే కూటమి హామీలు నెరవేర్చడం కష్టమని, మరింత అప్పులు తేవాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీకి 250 లోపే సీట్లు వచ్చి, మనపై ఆధారపడితే కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చని గతంలో జగన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చిందని, కాబట్టి కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. చంద్రబాబు ఆదిశగా ఆలోచిస్తారా? కేవలం పదవులు, ఆర్థిక ప్యాకేజీలకు ప్రాధాన్యమిస్తారా.. అనేది ఆసక్తిగా మారింది.
————————–