* రోజా ఓటమిపై ఆనందంలో అసమ్మతి వర్గం
* వాళ్లూ వైసీపీ నేతలే
ఆకేరు న్యూస్, విజయవాడ : ఫలితాల అనంతరం ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన నగరి(Nagari) నియోజకవర్గంలో వైసీపీ(YCP) అభ్యర్థి ఓడిపోవడంపై వైసీపీ నేతలే సంబరాలు చేసుకుంటున్నారు. రోజా(Roja) ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నగరిలో రోజా ఓటమితో ఆమెపై అసమ్మతితో ఉన్న వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి(KJ Shanthi). పదేళ్లుగా ‘నగరికి పట్టిన శని విరగడైందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఉన్నాడని ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడ్డారని కీలక ఆరోపణలు చేశారు. అందుకే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత రోజా మౌనంగా ఉన్నారు. నగరిలోని ఇంటికే పరిమితం అయ్యారు. పోలింగ్ రోజే రోజా తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితం ఎలా ఉండబోతోందో ముందే ఊహించినట్టుగా రోజా మాట్లాడారు. అసమ్మతివర్గం తన ఓటమితో సంబరాలు చేసుకుంటున్నా మాజీ మంత్రి రోజా మౌనంగానే ఉన్నారు. నగరిలో మొదటి నుంచీ రోజా వర్సెస్ కేజే శాంతి అన్నట్టుగా రాజకీయం నడిచింది. పార్టీ అధినేత జగన్ సైతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
——–