
* నలభై ఎనిమిదేళ్ళుగా తెగని పంచాయితీ..
* ఫారెస్ట్ వర్సెస్ రెవిన్యూ
* ఇనుపరాతి గుట్టల్లో బుల్డోజర్ వార్
* ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
* జేసీబీలతో దూసుకొచ్చిన రైతులు
* సరిహద్దులు నిర్ణయించకుండా ఇంచు కూడా వదిలేది లేదంటున్న ఫారెస్ట్ అధికారులు
* త్వరలోనే పరిష్కారం అవుతుంది: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బిక్షపతి
( చిలుముల్ల సుధాకర్ )
వరంగల్- ప్రతినిధి , ఆకేరు న్యూస్ , ఎప్రిల్ 3: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మద్య భూ వివాదం సమసి పోక ముందే మరో వివాదం ముందుకు వచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో రెవిన్యూ వర్సెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల మద్య ఏకంగా బుల్దోజర్ వార్ కొనసాగుతోంది. అటవిశాఖ ఆదీనంలో ఉన్న పట్టా భూములను రైతులకు ఇప్పించాలన్నస్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అటవీ శాఖాధికారులకు లేక రాశారు. దీంతో బుధవారం కొంత మంది రైతులు ఇనుపరాతి గుట్టల్లో తమకు పట్టా భూములున్నాయని వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఏకంగా జేసీబీలతో వెళ్ళారు. ఈ భూమి తమ ఆధీనంలో ఉన్నందున రైతులకు ఇచ్చే ప్రసక్తి లేదని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు , స్థానికుల మద్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.ఇరు వర్గాలను శాంతింపజేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
* ఇదీ 48 ఏళ్ళ పంచాయితీ..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంతో మొదలై వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో ఇనుపరాతి గుట్టలు విస్తరించి ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతికగా ఏకంగా 3950 ఎకరాల్లో ఈ గుట్టలు ఉన్నాయి. 1967 ( 1355 ఫస్లీ ) లో రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా ప్రకటించాలని అటవీ శాఖ అధికారులు ( సెక్షన్ – 4 ) ప్రతిపాదనలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కారణాలేమైనప్పటికీ అధికారికంగా ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా డిక్లేర్ చేయలేదు. ఇనుపరాతి గుట్టలను అటవీ బ్లాక్ గా గుర్తించింది. అటవీ శాఖ ఈ భూముల్లోని అటవీ సంపదను కాపాడడం కోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది. సాంకేతికంగా ఇనుపరాతి గుట్టలు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించక పోయినప్పటికీ అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం ఈ భూములు అటవీ ప్రాంతంగానే అధికారికంగా పరిగణించాల్సి ఉంటుందన అటవీ అధికారులు చెబుతున్నారు. ఇంతకాలంగా ఆ భూముల్లో అటవీ సంరక్షణ చట్టాల ప్రకారమే అటవీ అధికారులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామంటున్నారు. ఎన్నో అరుదైన వృక్షాలు, జంతువులు, పక్షులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు.
* ఇపుడు పంచాయితీ ఏంటి..?
ఇనుపరాతి గుట్టలు ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూర్ గ్రామాలు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. రాజీవ్ గాంధీ హనుమంతు హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్న కాలంలో నిర్వహించిన జాయింట్ సర్వే ప్రకారం అటవీ భూమి 3950 ఎకరాల్లో విస్తరించి ఉంది. సీలింగ్ భూమి 343 ఎకరాల 07 గుంటలు, ఇందులో 20 మందికి రెండెకరాల చొప్పున 40 ఎకరాల భూమి పేదలకు అసైన్మెంట్ చేశారు. దేవునూరు గ్రామంలో అటవీ శాఖ ఆదీనంలో ఉన్న 148 ఎకరాల 29 గుంటల భూమి 8 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. వీరంతా సాగులో లేరని రెవిన్యూ అధికారులే చెబుతున్నారు. ముప్పారం గ్రామంలో 58 ఎకరాల 27 గుంటల భూమికి పట్టాలు ఇచ్చారు. వీరంతా ఈ భూమిని సేద్యం చేస్తున్నారని జాయింట్ సర్వేలో తేలిందని ఆ నివేదికలో వెల్లడించారు..
* జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లేఖతో మంటలు
అటవీ శాఖ ఆదీనంలో ఉన్న రెవిన్యూ భూములను వెంటనే ఖాళీ చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ డీఎఫ్ వో కు మార్చి 27న లేఖ రాశారు. అటవీ శాఖ స్పందించక ముందే ఈ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. దీంతో రైతులు ఏకంగా జేసీబీలతో భూమి చదును చేసేందుకు వెళ్ళారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది , అధికారులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీలు చదును చేయకుండా ఆపేశారు. దీంతో రైతులు , అటవీశాఖాదికారుల మద్య తీవ్ర స్థాయిలో వ్యాగ్యుద్దం జరిగింది. ధర్మసాగర్ తాహసిల్దార్, స్థానిక సీఐ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అటవీశాఖాదికారులు ఖాతరు చేయడం లేదంటూ రైతులు మండి పడ్డారు. అటవీ శాఖాదికారులు సైతం తమకు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నడుచుకుంటామని వాదించారు. పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చుతుండడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు.
* ఇంతకు కలెక్టర్ లేఖలో ఏముంది..?
అటవీ శాఖ ఆదీనంలో ఉన్న రెవిన్యూ భూములను వెంటనే ఖాళీ చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అటవీశాఖాధికారులకు లేఖ రాశారు. రెవిన్యూ, ల్యాండ్ అండ్ సర్వే విభాగం, ఫారెస్ట్ అధికారుల జాయింట్ సర్వే లో తేలిన అంశాల మేరకే పట్టాదారుల భూములను ఖాళీ చేయాలన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 213, 214,215,216 భూములు, దేవునూర్ గ్రామ పరిధిలోని సర్వే నెం. 403, 404 భూములు అటవీ శాఖకు సంబందించినవి కావని తేలినందున ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందులో ఒక సర్వే నెంబర్ 213 కి సంబందించి కోర్ట్ కేసులు ఉన్నందును ఆ భూమికి సంబందించి స్టేటస్ కో మెయింటెయిన్ చేయాలన్నారు. 1967లో ఈ భూములను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో ఈ సర్వే నెంబర్లు లేనందున అవి ఫారెస్ట్ భూములుగా పరిగణించబడవన్నది రెవిన్యూ అధికారుల వాదన.
* ఫారెస్ట్ అధికారుల వాదన ఏంటి..?
హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకైక అటవీ ప్రాంతం ఇనుపరాతి గుట్టలు మాత్రమే.. ఇదీ కూడా లేకుండా పోతే ఈ జిల్లాలో అటవీ లేకుండా పోతుందంటున్నారు. 48 సంవత్సరాల క్రితం సెక్షన్ -04 లో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని ప్రతిపాదనలు అటవిశాఖ పంపించింది. ఏ కారణాల చేతనో రాష్ట్ర ప్రభుత్వం ఇనుపరాతి గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్ గా డిక్లేర్ చేయలేదు. అంత మాత్రం చేత ఆ భూములు ఫారెస్ట్ భూములు కాకుండా పోవని అటవీ శాఖాధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని అటవీ చట్టాలే చెబుతున్నాయంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇనుపరాతి గుట్టల ప్రాంతాన్ని ఫారెస్ట్ బ్లాక్ గా గుర్తించింది. దీని కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం డీఎఫ్ వో, రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇతర సిబ్బందిని కూడా నియమించిందంటున్నారు. అదే విదంగా ఇంత కాలంగా అక్కడ అటవీ సంరక్షణకు సంబందించిన అన్ని పనులు చేపడుతున్నాం . తప్పని సరిగా ఫారెస్ట్ భూములుగానే పరిగణించాలి అని గట్టిగా చెబుతున్నారు.
* త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
బిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హనుమకొండ
ఇదీ దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. ఇటీవలే జాయింట్ సర్వే కూడా అయింది. సెక్షన్ -4లో రిజర్వ్ ఫారెస్ట్ భూములుగా ప్రకటించాలన్నప్రతిపాదనలో రెవిన్యూ శాఖ చెబుతున్న సర్వే నెంబర్లు లేవు నిజమే.. అదే మేము కూడా చెబుతున్నాం.. రిజర్వ్ ఫారెస్ట్‌గా మేము ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో రెవిన్యూ శాఖ మాకు ఒక మ్యాపు ఇచ్చింది. ఆ మ్యాపులో ఇపుడు చెబుతున్న సర్వె నెంబర్లు లేనే లేవు. అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తాయన్నదే మా ప్రశ్న. ఈ సమస్య పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ రెవిన్యూ, ల్యాండ్ అండ్ సర్వే, అటవీ శాఖాదికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ, రెవిన్యూ శాఖ చెబుతున్న అంశాలను పరిశీలించి మ్యాప్ ను తయారు చేయాలని సంబందిత అదికారులను ఆదేశించారు.
———————————-