* చెరువులను ఆక్రమించినవాళ్లను చెరసాలకు పంపుతా..
* ఆగర్భ శ్రీమంతులారా.. మీ ఆక్రమణలను మీరే కూల్చండి
* లేదంటే కూల్చేయించే బాధ్యత నాదే
* చెరువుల ఆక్రమణలతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయ్
* పేదల నివాసాలపై సానుకూలంగా ఉంటాం..
* మూసీ పరివాహక ప్రాంతంలోని 11 వేల మందికి డబుల్ ఇళ్లు
* ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
* పోలీసులు భాగస్వామ్యం కావాలని వినతి
* డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
* హైదరాబాద్, వరంగల్‌లో పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు అకాడమీలో ఈ రోజు జరిగిన 547 మంది ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాలు, చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి తీరుతామని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత పెద్ద మనుషులవైనా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఇళ్లను నేలకూల్చి తీరుతామని స్పష్టం చేశారు. చెరువులను చెరబట్టిన శ్రీమంతుల నుంచి వాటిని విడిపిస్తానని, అవసరమైతే చెరబట్టిన వాళ్లను చెరసాలకు పంపుతామనని హెచ్చరించారు. ఎఫ్ టీఎల్‌లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నవారు తమ నిర్మాణాలను తామే కూల్చాలని, లేకుంటే కూల్చే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ హెచ్చరించారు.
రాష్ట్రం పచ్చగా ఉండేందుకే కూల్చివేతలు
తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలంటే చెరువులను, కుంటను కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉందని పోలీసులకు సూచించారు. వరదలు ఉప్పెనై నగరాన్ని కమ్మేస్తే.. వేలాది మంది ప్రజలు మరణిస్తే.. ఆనాటి ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నాటి నిజాం కట్టించారని, మహానగరానికి తాగునీటి వసతిని కల్పించారని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టుల చుట్టూ ఆగర్భ శ్రీమంతులు చెరువులను చెరిపేసి ఫామ్ హౌస్‌లను కట్టేసి.. వాళ్ల డ్రైనేజీ నీటిని తీసుకొచ్చి గండిపేట నీళ్లలో కలుపుతున్నారని, ఆ నీళ్లు తాగునీళ్లలో కలుస్తుంటే, ఆ నీళ్లు నగర ప్రజలకు తాగడానికి ఇస్తే.. ముఖ్యమంత్రిగా తన వైఫల్యం కాదా ఆలోచించండి.. అని ప్రజలకు సూచించారు. భవిష్యత్ తరాలకు చెరువులను, కుంటలను అందిస్తానని ప్రకటించారు. ఈ రోజు వరదలు వస్తే ఆ నీరు పేదల ఇళ్లలోకి పోతున్నాయి.. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిజ్‌లు, టీవీలు, బట్టలు, వస్తువులు అన్నీ తడిసిపముద్దయి, వారు అనాథల్లా రోడ్డుపై నిలబడడానికి ఆక్రమణలే కారణమన్నారు. వారి శ్రేయస్సు కోసం చెరువుల్లో ఎంతటి మహానుభావుల నిర్మాణాలున్నా కూల్చి తీరతానని వెల్లడించారు. మీరే ఆక్రమణలను కూల్చి.. స్థలాలను నీటి పారుదల శాఖకు అప్పగించాలని ఈ వేదిక నుంచి శ్రీమంతులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాలకు కూడా వెళ్లి స్టేలను వెకేట్ చేయించి మీ ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు.
నల్గొండకు హైదరాబాద్ వ్యర్థ జలాలు
హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య వ్యర్థ జలాలు నల్గొండకు చేరుతున్నాయని, నల్లగొండకు వస్తున్న కాలుష్యాన్ని అరికట్టి, మూసీని ప్రక్షాళన చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారని, అందుకే కేంద్ర సహకారంతో మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పేదలు కూడా ఇళ్లను కట్టుకున్నారని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారు అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించి, ఆత్మగౌరవంతో బతికేలా ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ రోజు శిక్షణ పొందిన ఎస్ఐలు అటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే స్కీంలు ఏమీ లేవని తెలిపారు.
వారి వెన్నులో వణుకు పుట్టించాలి..
తెలంగాణ ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా కొత్త ఎస్ఐలు పని చేయాలని, నేరగాళ్లు, కబ్జాదారుల మోకాలులో వణుకు పుట్టాలని, వెన్నులో చలి జ్వరం వచ్చేలా చేయాలని సూచించారు. ఇది మన తెలంగాణ.. మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మనపై ఉందని వెల్లడించారు. మేం ఆదేశాలు మాత్రమే ఇస్తామని, అమలు చేయాల్సిన బాధ్యత మీదేనన్నారు. ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం గా భావించి పనిచేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో అన్ని శాఖల్లోనూ మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
సైనిక స్కూళ్ల తరహాలో..
సైనిక స్కూళ్ల తరహాలో.. పోలీసులకు పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో 50 చొప్పున ఎకరాల్లో స్కూళ్లు కట్టించి, వారి పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. పోలీసు కుటుంబాల పిల్లల కుటుంబాలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామన్నారు. రానున్న రెండేళ్లలో పోలీసు స్కూలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన తనకు పోలీసు యోగక్షేమాలు తెలుసుకుని, సమస్యలు తీర్చే బాధ్యత తనదేనన్నారు. పోలీసు గౌరవం పెంచే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీరు తెలంగాణకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
గడిచిన తొమ్మిది ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక టీఎస్ పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. తొంబై రోజుల్లోనే 35వేల ఉద్యోగాలు కల్పించామని, మా ప్రభుత్వ పనితీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నామన్నారు. శిక్షణ పొందిన పోలీసులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరూ రైతుల బిడ్డలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లని, తనకు రైతుల కష్టాలు తెలుసు కాబట్టే, 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల మంది రైతుల ఖాతాలో వేసి వారి కళ్లలో ఆనందం చూశానన్నారు. వ్యవసాయం దండగ కాదు.. వ్యవసాయం పండుగ అని నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
సీఎంఆర్ ఎఫ్‌కు పోలీసు శాఖ భారీ విరాళం
సీఎంఆర్ ఎఫ్‌కు పోలీసు శాఖ భారీ విరాళం ప్రకటించింది. ఒకరోజు వేతనం 11,06,83,571 అందజేసింది. ఈ మేరకు పాసింగ్ ఔట్ పరేడ్ వేదికపై సీఎం రేవంత్‌కు డీజీపీ జితేందర్ సంబంధిత చెక్కును అందజేశారు.
———————————