* ముగ్గురు సజీవ దహనం
* ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి
* 45 మంది భారతీయులే
* అత్యధికంగా కేరళకు చెందిన 24 మంది కార్మికులు
* కొచ్చీకి మృతదేహాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : కువైట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం (Kuwait Fire Accident) దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 49 మంది దుర్మరణం చెందడం కలిచివేసింది. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన చాలా మంది కార్మికులు ఆ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు(Burned alive). కేరళకు చెందిన 24 మంది కార్మికులు ఉండగా, మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉన్నట్టు తాజాగా బయటపడింది. కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. ఇప్పటికే కేరళకు (Kerala) చెందిన కార్మికుల మృతదేహాలు కొచ్చీకి ఎయిర్‌పోర్టుకు (Kochi Airport) చేరుకున్నాయి. బాధిత కుటుంబాల హాహాకారాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం విషాదంతో నిండిపోయింది. సీఎం పినరయి విజయ్ (CM Pinarayi Vijayan) అక్కడకు చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతదేహాలను ఇళ్లకు తరలించే ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
—————————-