Thumati Madhava Rao
* గవర్నర్కు డిప్యూటీ చైర్మన్ ఫిర్యాదు
Thumati Madhava Rao| ఆకేరు న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు తనకు ప్రొటోకాల్ ప్రకారం అందాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కనీసం చాంబర్ కూడా కేటాయించలేదని, వ్యక్తిగత కార్యదర్శి సహా అవసరమైన సిబ్బందిని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ అంశాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
సభలో అవమానించారని ఆరోపణ
ఏకగ్రీవంగా ఎన్నికైన తనను డిప్యూటీ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టే సమయంలో అధికార కూటమి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారని మాధవరావు ఆరోపించారు. ఈ పరిణామం తనను అవమానించినట్లుగా ఉందని పేర్కొన్నారు. కేబినెట్ హోదా కలిగిన పదవికి తగిన ప్రొటోకాల్, గౌరవం కల్పించడం లేదని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు.
సిబ్బంది నియామకంలో నిర్లక్ష్యం
డిప్యూటీ చైర్మన్కు కేటాయించాల్సిన వ్యక్తిగత కార్యదర్శి, అదనపు పీఎస్తో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించలేదని మాధవరావు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన సొంత గ్రామంలోని దేవాలయంలో వీవీఐపీ గేటుకు తాళాలు వేయించారని ఆరోపించారు. ఈ చర్యలు వ్యక్తిగత అవమానంతో పాటు రాజ్యాంగ వ్యవస్థల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
‘రెడ్ బుక్ రాజ్యాంగమా?’
శాసనమండలి సెక్రటరీ జనరల్, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మాధవరావు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? లేక ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థల ఉల్లంఘనపై గవర్నర్ జోక్యం చేసుకుని, తనకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
విచారణకు గవర్నర్ హామీ
తన ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ ఈ అంశంపై విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు తూమాటి మాధవరావు వెల్లడించారు. డిప్యూటీ చైర్మన్ పదవికి సంబంధించిన ప్రొటోకాల్, సిబ్బంది నియామకం, చాంబర్ కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

