*తప్పు ఒప్పుకున్న టాప్ సైంటిస్ట్
*అప్రూవర్లుగా ముగ్గురు నిందితులు
తిరుమల: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు తాము చేసిన నేరాన్ని కోర్టు ముందు అంగీకరించడమే కాకుండా, అప్రూవర్లుగా మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాక్టర్ బత్తల సురేంద్రనాథ్. దేశంలోని అత్యున్నత స్థాయి డెయిరీ సైంటిస్టులలో ఒకరైన ఆయన, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI) బెంగళూరు ప్రాంతీయ కేంద్రంలో కెమిస్ట్రీ విభాగాధిపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 2013 నుండి టీటీడీకి నెయ్యి కొనుగోలు, ప్లాంట్ల తనిఖీ విషయంలో కీలక సలహాదారుగా వ్యవహరించారు. 2019 తర్వాత జరిగిన పరిణామాల్లో నిందితుల వలలో చిక్కుకున్నట్లు సమాచారం. తిరుమలలో ప్రొటోకాల్ దర్శనాలు, వీఐపీ వసతి వంటి మర్యాదలకు మురిసిపోయి, కల్తీ నెయ్యి సరఫరా చేసే డెయిరీలకు ఆయన సహకరించినట్లు కోర్టులో ఒప్పుకున్నారు. గత డిసెంబర్ మొదటి వారంలోనే కోర్టులో హాజరైన నిందితులు, తాము ఎందుకు ఈ తప్పు చేయాల్సి వచ్చిందో వివరించారు. డాక్టర్ సురేంద్రనాథ్, డెయిరీ నిపుణుడిగా ఉండి నివేదికల్లో అక్రమాలకు సహకరించడం. కల్తీకి అవసరమైన రసాయనాలు సరఫరా చేయడం. భోలేబాబా డెయిరీ ఉద్యోగి, డెయిరీ తరపున జరిగిన అక్రమాల్లో పాలుపంచుకోవడం. నిందితులు అధికారులను తమ దారికి తెచ్చుకోవడానికి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ప్రొటోకాల్ మర్యాదలతో అధికారులను బుట్టలో వేసుకుని, తనిఖీ నివేదికలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని విచారణలో తేలింది.
