* హోంగార్డు తరహాలో వారికి విధులు
* 23చోట్ల హెల్త్ క్లినిక్ లు
* ఆసక్తి ఉన్నవారిని గుర్తించి నియమించాలి
* పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆసక్తి ఉన్న ట్రాన్స్ జెండర్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పోలీసు అధికారుకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కి పైగా ట్రాన్స్ జెండర్లు ఉంటే వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్లు అంచనా. ట్రాన్స్ జెండర్లపై సమాజంలో ఉన్న వివక్ష కారణంగా వారిపై ఆదరణ కరవు అవుతున్నది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రోత్సహించేవారు లేక, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక తప్పటడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్ర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చేయూతనందిస్తున్నాయి. ట్రాన్స్ జెండర్లకు ఉన్న విద్యార్హతను బట్టి ఉపాధి అంశాలపై శిక్షణ ఇస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి వారిని ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమిస్తారు.
ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక క్లినిక్ లు..
రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధన ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రుల్లో ఈ క్లినిక్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా, ట్రాన్స్ జెండర్ల కోసం వారానికి రెండు, మూడు రోజులు ప్రత్యేక క్లినక్ లను నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం క్లినిక్ లు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న క్లినిక్ లలో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
————————